rajavommangi
-
Photo Feature: అబ్బురపరచిన సంధ్యారాగం
మంగళవారం సాయంత్రం సూర్యుడు పడమటి వైపు వాలుతూ రాజవొమ్మంగిలో కనువిందు చేశాడు. అక్కడ కారుమబ్బులను చీల్చుకుంటూ కాసేపు వలయాకారంలో ఆకాశాన్ని ఎరుపెక్కించి తిరిగి 6–38 నిముషాలకు అదృశ్యమయ్యాడు. ఈ దృశ్యం స్థానికులను అబ్బురపరచగా, కొంత మంది తమ సెల్ఫోన్లలో బంధించారు. – రాజవొమ్మంగి -
నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు. చదవండి: Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి.. పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి. ఆవకాయకు బహుబాగు కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
తూర్పుగోదావరి: కల్తీ కల్లు తాగి నలుగురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా ఏజెన్సీలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. రోజు సేవించే కల్లు ఎలా కల్తీకి గురైందనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి
రాజవొమ్మంగి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో బాలుడిగా ఉన్న తాను.. ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని.. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకొనేవారని స్థానికులు తెలిపారు. అయితే వయసు మీదపడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
తూర్పులో అరుదైన కింగ్ కోబ్రా హల్చల్..
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో అరుదైన కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. తొలుత గ్రామంలోని ఓ చెట్టుపై 15 అడుగుల పొడవు ఉన్న పాము ఉండటాన్ని స్థానికులు గమనించారు. అది అరుదైన కింగ్ కోబ్రా కావడంతో.. పెద్ద ఎత్తున గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గ్రామస్తులు కింగ్ కోబ్రా గురించి విశాఖ వైల్డ్ లైఫ్ అదికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న విశాఖ అటవీశాఖ అధికారులు బృందం.. కింగ్ కోబ్రాను బంధించి తీసుకెళ్లిపోయారు. కాగా, కింగ్ కోబ్రా చెట్టుపై తిరుగుతున్న దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
పసిమొగ్గ అసువులు తీసిన శునకం
రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది. -
చెక్క పెట్టెలో చిన్నారుల మృతదేహాలు
సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చివరికి చెక్క పెట్టెలో విగత జీవులుగా కనిపించారు. అనూహ్యంగా గ్రామంలోని పాడుబడిన పాఠశాలలో ఉన్న చెక్కపెట్టలో వీరిద్దరు శవాలుగా కనిపించారు. కాగా బేలెం ప్రశాంత్ కుమార్, చెడెం కార్తీక్ కనిపించడం లేదంటూ గత నెల 26న వారి తల్లిదండ్రులు జడ్డంగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన చిన్నారుల గురించి వెతకటం ప్రారంభించారు. అయితే ఆడుకుంటూ వీరిద్దరూ పెట్టెలోకి దూరి ఉంటారని, మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో.. -
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో..
-
ప్రజాశ్రేయస్సే పరమావధి
పోలీసు శాఖ ఉత్తమ సేవలు డీజీపీ సాంబశివరావు రాజవొమ్మంగి : ప్రజలు నిశ్చింతగా, ప్రశాంత వాతావరణంలో జీవించేలా సేవలు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. రాజవొమ్మంగిలో రూ.2 కోట్లతో నిర్మించిన ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్సుకు ఆయన గురువారం ప్రారంభించారు. తొలుత ఈ రెండస్తుల ఆధునిక పోలీస్‌స్టేషన్ ఎదుట నెలకొల్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాశ్రేయస్సే పోలీస్ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. గతంలో ఏజెన్సీకు రావాలంటూ ఒక రకమైన ఆందోళన వుండేదని పదేళ్లలో పోలీస్‌శాఖ పనితీరు మెరుగుపడడంతో ఏజెన్సీలో ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నామన్నారు. ఏమాత్రం ఏమరపాటు లేకుండా శాంతి భద్రలకు విఘాతం కలగకుండా తమ పోలీసు సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.నక్సల్స్ ప్రభావంతో గతంలో మనం ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్నాళ్లు అభివృద్ధికి దూరంగా వున్నామో తెలియంది కాదని, అటువంటి దుష్పరిణామాలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్ చారిత్రాత్మకమైనది అల్లూరి సందర్శించిన రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్ చారిత్రాత్మకమైనదని, దీనిని మరింత అభివృద్ధి చేసి ప్రజాసందర్శనకు వీలుగా పెడతామన్నారు. అల్లూరి తైలవర్ణ చిత్రాలు, ఆనవాళ్లతో ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాజవొమ్మంగి పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని ఆయన ఆశక్తిగా తిలకించారు. డీజీపీకి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు జ్ఞాపిక అందజేశారు. ఆయనతో పాటు ఐజీపీ ఆంధ్రారీజన్ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్.రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాశ్, ఓఎస్డీ రవిశంకరరెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అడ్నాన్ నయూం అస్మి హాజరు కాగా స్థానిక సీఐ వెంకట త్రినాథ్, ఎస్సైలు రవికుమార్, వెంకట నాగార్జున కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాఠశాల చిన్నారులతో మమేకమైన డీజీపీ రాజవొమ్మంగి శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో డీజీపీ సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. డీజీపీ అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వక పోవడంతో ఇంకా బాగా చదువుకోవాలన్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు వన్నాయా అని అడిగిన ప్రశ్నకు పిల్లలు టాయ్‌లెట్స్ డోర్స్లేవని బదులిచ్చారు. దీంతో వెంటనే రూ.25 వేల నగదు అందజేసి వెంటనే మరుగుదొడ్లను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని ఆయన రంపచోడవరం ఏఎస్పీని ఆదేశించారు. ఇంకా అవసరమైతే నగదు అందజేస్తానని అన్నారు. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వున్నారా అని ప్రశ్నించిన డీజీపీ ఆ వెంటనే మరో రూ.8 వేల నగదు అందజేసి ప్రతి ఒక్కరికీ జామెట్రీ బాక్స్ (కాంపాస్ బాక్స్‌లు) కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. -
సైకిల్ నేర్పిస్తానని తీసుకెళ్లి..
రాజవొమ్మంగి(తూర్పుగోదావరి): సైకిల్ నేర్పిస్తానంటూ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మండలంలోని కన్నయమ్మపేట గ్రామానికి చెందిన ఐదో తరగతి చదివే బాలిక(10)పై పొరుగింట్లో ఉండే వ్యక్తి చూపుపడింది. వివాహితుడైన అతడు శుక్రవారం సాయంత్రం సైకిల్ నేర్పుతానంటూ బాలికను ఊరి బయట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై ఇంటికి తీసుకువచ్చాడు. రాత్రి సమయంలో బాధితురాలు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్లు తేల్చారు. బాలిక విషయం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దీని దుంపతెగా
రాజవొమ్మంగి : సాధారణంగా ఒకటి, రెండు కిలోల బరువు మాత్రమే తూగే కర్రపెండలం దుంప ఏకంగా తొమ్మిది కిలోల బరువుతో చూపరులను అబ్బురపరుస్తోంది. రాజవొమ్మంగిలోని మైలబోయిన సత్యనారాయణ, శిరీష దంపతులు తమ ఇంటి పెరటిలో గతేడాది నాటిన దేశవాళీ కర్రపెండలం చెట్టు నుంచి వారు ఒకటి, రెండు సార్లు దుంపలు తవ్వి తిన్నారు. అదేమాదిరి బుధవారం కూడా తవ్వుతుండగా ఓ భారీ దుంప బయటపడింది. దాదాపు మీటరున్నర పొడవుతో లావుగా ఉన్న ఆ దుంపను చూసి స్థానికులు ఆవాక్కయ్యారు. అదే ఇంటి ప్రాంగణంలో అద్దెకు ఉంటున్న వ్యవసాయ విస్తరణాధికారి కత్తులు సోమిరెడ్డి మాట్లాడుతూ నేల స్వభావం, చెట్టుకు అందిన తేమ వల్ల ఈ దుంప భారీగా పెరిగి ఉండవచ్చన్నారు. ఇలా పెరగడం చాలా అరుదని ఆయనన్నారు. -
ప్రియురాలితో భర్త పెళ్లి చేసిన భార్య
రాజవొమ్మంగి : వారు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవం గ్రహించిన అతడి భార్య.. ప్రియురాలి తో దగ్గరుండి భర్త వివాహం జరిపించింది. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన భాను అనే యువతిని ఇచ్చి పెద్దలు స్థానిక శ్రీకోదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు. గతేడాది అప్పారావు తప్పనిసరి పరిస్థితుల్లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇలాఉండగా అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు. -
డయేరియాతో గిరిజన బాలిక మృతి
దాకరాయి(రాజవొమ్మంగి) : రాజవొమ్మంగి మండలం శరభవరం పంచాయతీ దాకరాయి గ్రామం సమీపంలో ‘కోదు ’ ఆదివాసీల తండాకు చెందిన ఓ ఆరేళ్ల బాలిక డయేరియాతో సోమవారం మరణించింది. కొండపోడు చేస్తూ జీవనం సాగిస్తున్న బార్సో, ఆనంద్‌ల కుమార్తె మువ్వల సాయి ఆదివారం సాయంత్రం నుంచి విరేచనాలతో బాధపడి నీరసించింది. ఆస్పత్రికి తీసుకు వెళదామనుకునే లోపే సోమవారం ఉదయం మరణించిందని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ పెద్దకుమారుడు భీమరాజు కూడా విరేచనాలతో బాధపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వీరుకాక గ్రామంలో మరికొంత మంది కడుపునొప్పి, ఇతర రుగ్మతలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ గ్రామం మారుమూలన ఉండడం వల్ల సకాలంలో వైద్యం అందించే ఆస్కారం లేకపోయిందని, అందువల్లే బాలిక మరణించిందని స్థానికులు చెబుతున్నారు. -
ఆదుకోవాలని గిరిజన యువతి వేడుకోలు
రాజవొమ్మంగి : తండ్రిని కోల్పోయి.. దిక్కు లేకుండా బతుకీడుస్తున్న తనను ఆదుకోవాలని రాజవొమ్మంగి మండలం గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన ఆదివాసీ(పీటీజీ) యువతి శ్యామల అధికారులను విజ్ఞప్తి చేసింది. 1993 అక్టోబర్‌లో నక్సలైట్ల తుపాకీ గుళ్లకు తన తండ్రి మరణించాడని, అప్పటికి తన వయసు కేవలం రెండు నెలలని పేర్కొంది. తల్లి మరో వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో పెద తండ్రి వద్ద పెరిగానని, పదో తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపింది. తన తండ్రి చనిపోవడంపై జెడ్డంగి పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 12/93గా నమోదైందని తెలిపింది. చార్జ్‌షీట్ 22-6-95గా నమోదైనట్టు వివరించింది. గతంలో తనకు కొంత ఆర్థికసాయం అందగా, దానిని తల్లి తీసుకుందని పేర్కొంది. ప్రభుత్వం తనలాంటి వారిని ఆర్థికంగా ఆదుకుంటోందని, చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తోందని తెలిసి తన ఇబ్బందులను వెల్లడి స్తున్నట్టు మంగళవారం విలేకరులకు తెలిపింది. ఈ విషయాన్ని సీఐ రాంబాబు దృష్టికి తీసుకువెళ్లగా, పాత రికార్డులను పరిశీలించి, అవకాశం ఉంటే ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తానని హామీ ఇచ్చారు. -
మాతాశిశువుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
లోదొడ్డి(రాజవొమ్మంగి) : లోతట్టు గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను అరికట్టి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ గిరిజనులకు హామీ ఇచ్చారు. బుధవారం మాతాశిశు సంక్షేమం కోసం మండంలోని జడ్డంగి, లోదొడ్డి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె ప్రారంభించారు. లోదొడ్డి పరిసర ప్రాంతాల్లో గర్భిణులు ఆస్పత్రులకు చేరేలోగా చనిపోతున్నారని తెలియడంతో ఆమె చలించిపోయారు. లోదొడ్డి వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. సుమారు గంటన్నరపాటు ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్‌కు సమస్యల ఏకరువు దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తమ గ్రామానికి జిల్లాకలెక్టర్ రావడంతో స్థానికులు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం వారు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. మంచం పట్టిన రోగిని దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకి తరలించేందుకు అవస్థలు పడతున్నామని, తీరా రోగి పరిస్థితి విషమిస్తే మృతదేహం తిరిగి ఇంటికి తెచ్చుకొనేందుకు కష్టాలు పడుతున్నామని గిరిజనులు కలెక్టర్‌కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ లోదొడ్డి గ్రామానికి రవాణా అవసరాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేయాలని రంపచోడవరం పీఓ గంధం చంద్రుడిని కోరారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఐదు నెలలో పూర్తి స్థాయి బీటీరోడ్ రూపొందించాలని సూచించారు. వాతంగి సబ్‌సెంటర్, గర్భిణుల వసతి గృహం ఏర్పాటుకు రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గర్భిణుల కోసం జడ్డంగి పీహెచ్సీలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ పద్మావతిని ఆదేశించారు. ప్రతి గిరిజన మహిళను పలుకరించి వారి సమస్యలను అడిగితెలుసుకొన్నారు.లోదొడ్డి వైద్య శిబిరానికి హాజరైన వాతంగి గ్రామానికి చెందిన గర్భిణి మంప రాఘవ హైరిస్క్ (రక్తహీనతతో బాధపడుతూ) కాన్పు కష్టం కావచ్చని జిల్లా కలెక్టర్ గమనించారు. ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా కాకినాడ వచ్చే రోగుల కోసం ప్రత్యేక బర్త్ వెయిటింగ్ రూం ను వెంటనే ఏర్పాటుచేయాలని రంపచోడవరం ఏడీఎంహెచ్ఓ పవన్ కుమార్ ను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆమె వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జడ్డంగి, లోదొడ్డి, వాతంగి సర్పంచ్‌లు కొంగర మురళీకృష్ణ, లోతా రామారావు, జుర్రా జాన్, వైఎస్సార్ సీపీ నేతలు గవాస్కర్, అర్జున్, తిమోతి, ఎంపీపీ కలింకోట నూకరత్నం, వైస్ ఎంపీపీ దంతులూరి శివరామచంద్ర రాజు, వ్యవసాయపరపతి సంఘం అధ్యక్షుడు గణజాల తాతారావు, ఆర్డీఓ శంకర వర ప్రసాద్, సీడీపీఓ రాజ్యలక్ష్మి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఈఈ పీకే. నాగేశ్వరరావు, డీఈ హరికృష్ణ, ఏలేశ్వరం క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ మహేశ్వరరావు హాజరయ్యారు.