ఆదుకోవాలని గిరిజన యువతి వేడుకోలు
రాజవొమ్మంగి : తండ్రిని కోల్పోయి.. దిక్కు లేకుండా బతుకీడుస్తున్న తనను ఆదుకోవాలని రాజవొమ్మంగి మండలం గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన ఆదివాసీ(పీటీజీ) యువతి శ్యామల అధికారులను విజ్ఞప్తి చేసింది. 1993 అక్టోబర్‌లో నక్సలైట్ల తుపాకీ గుళ్లకు తన తండ్రి మరణించాడని, అప్పటికి తన వయసు కేవలం రెండు నెలలని పేర్కొంది. తల్లి మరో వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో పెద తండ్రి వద్ద పెరిగానని, పదో తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపింది. తన తండ్రి చనిపోవడంపై జెడ్డంగి పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్ 12/93గా నమోదైందని తెలిపింది. చార్జ్‌షీట్ 22-6-95గా నమోదైనట్టు వివరించింది. గతంలో తనకు కొంత ఆర్థికసాయం అందగా, దానిని తల్లి తీసుకుందని పేర్కొంది. ప్రభుత్వం తనలాంటి వారిని ఆర్థికంగా ఆదుకుంటోందని, చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తోందని తెలిసి తన ఇబ్బందులను వెల్లడి స్తున్నట్టు మంగళవారం విలేకరులకు తెలిపింది. ఈ విషయాన్ని సీఐ రాంబాబు దృష్టికి తీసుకువెళ్లగా, పాత రికార్డులను పరిశీలించి, అవకాశం ఉంటే ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తానని హామీ ఇచ్చారు.