గ్రేస్ పుష్ప (ఫైల్)
రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment