Kakinada Hospital
-
పసిమొగ్గ అసువులు తీసిన శునకం
రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది. -
వృద్ధులపై హింసను అరికట్టేందుకు చర్యలు
తాడితోట (రాజమహేంద్రవరం): వృద్ధులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. చెల్లెలు(పిన్ని కుమార్తె) ప్రగడ మంగాదేవి చేతిలో చిత్రహింసలకు గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతిని మంగళవారం మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, పీడీ ఎన్.సీతామహాలక్ష్మి, సీడీపీఓ వై.సుశీల కుమారి పరామర్శించారు. వృద్ధురాలి పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు వేధింపులకు గురి కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, ఆర్ఎంఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి పరిస్థితి విషమం.. కాకినాడకు తరలింపు చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు పంతం పుష్పవతి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కాకికాడలో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, కాకినాడ : మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఉదంతం సుఖాంతమైంది. అపహరణకు గురైన బుజ్జాయి ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా మూడు రోజుల క్రితం ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ మహిళ ... ప్రసూతి ఆస్పతి వార్డులో ఉన్న గంటా లక్ష్మి అనే మహిళ అనే బాలింత నుంచి ఒక్కరోజు వయస్సు ఉన్న ఆడశిశువును వ్యాక్సిన్ కోసమని నమ్మబలికి వెంట తీసుకు వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ వెళ్లినా.. ఆమె కళ్లుగప్పి..శిశువును ఆగంతకురాలు అపహరించింది. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా పోలీసులు ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన పండు రమణ అనే అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి శిశివును తీసుకుని తల్లి లక్ష్మీకి అందజేశారు. నిందితురాలు గతంలో కాకినాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసిందని...అయితే ఆరు నెలల క్రిందట ఆమెకు అబార్షన్ కావడంతో పిల్లలపై మమకారంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. -
పాడె కట్టేముందే ప్రాణాలొచ్చాయి!
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి పెదపాటి బుచ్చిరాజు భార్య కమల(65) రాజమహేంద్రవరంలో తన కుమార్తెను చూసేందుకు గురువారం వెళ్లి మేడ మెట్లపై నుంచి కాలుజారి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గురువారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స చేయాలని, అయినా ప్రాణం నిలబడుతుందన్న నమ్మకం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు అందుకు సిద్ధమయ్యారు. ఇంతలో బంధువుల్లో ఒకరు ఆమె చనిపోయిందని.. వైద్యులు ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నారని చెప్పడంతో రాజమహేంద్రవరంలోని ఆమె కుమార్తె ఇంటికి తీసుకొచ్చారు. రాజానగరంలోని బట్టల వర్తకులు సంతాపాన్ని పాటిస్తూ దుకాణాలు మూసివేశారు. విదేశాల్లో ఉన్న మనవడి కోసం ఆమెను గురువారం రాత్రంతా ఉంచారు. శుక్రవారం అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె కదులుతుందని గమనించిన అక్కడున్నవారు బతికే ఉందని తెలిపారు. దీంతో బంధువులు స్పూన్‌తో పాలు కమల నోట్లో పోయడం, వాటిని ఆమె మింగడంతో బతికుందని నిర్ధారించుకున్న బంధువులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. -
జ్యోతుల నెహ్రూకు స్వల్ప అస్వస్థత
కాకినాడ ఆస్పత్రిలో చేరిక.. పలువురి పరామర్శ కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను కాకినాడలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జ్యోతుల నెహ్రూను ప్రత్తిపాడు, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, జడ్పీ మాజీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ జిల్లా యువజన, వాణిజ్యవిభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, నాయకులు అత్తిలి సీతారామస్వామి, గొల్లపల్లి బుజ్జి, అత్తులూరి సాయిబాబు, అత్తులూరి నాగబాబు, మాకినీడి గాంధీ, భూపాలపట్నం ప్రసా ద్, మారిశెట్టి భద్రం, వీరంరెడ్డి కాశిబాబుఆస్పత్రికి వచ్చి కలిసి పరామర్శించారు. -
నగరం ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడి మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి.. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పందొమ్మిదేళ్ల కాసు చిన్నా మృతి చెందారు. గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై, అధికారులుపై పలు కేసులు నమోదు చేశారు. మృతుల బంధువులకు 25 లక్షల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్రాలతోపాటు, గెయిల్ సంస్థ ప్రకటించింది. -
గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే
అమలాపురం : గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు అయిదుగురు ఉన్నారు. గాయపడినవారి వివరాలు. 1.ఎం.డి.తఫీ,2.తాటికాయల రాజ్యలక్ష్మి, 3.ఓనరాసి దుర్గాదేవి, 4.ఓనరాసి వెంకటరత్నం,5.రాయుడు సూర్యనారాయణ, 6.బోనం పెద్దిరాజు, 7.బోనం రత్నకుమారి,8.పల్లాలమ్మ, 9.ఓనరాసి మధుసూదన్ (9), 10.మోహన్ కృష్ణ (7), 11.జోత్స్నాదేవి (8), 12.కావీ చిన్నా (18నెలలు). కాగా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దాల బాలాజీ, గోపిరెడ్డి దివ్యతేజ మృతి చెందారు. దుర్ఘటనలో 18మంది సజీవ దహనం కాగా, 30మంది గాయపడిన విషయం తెలిసిందే. -
లిఫ్ట్, గోడల మధ్య ఇరుక్కుని బాలుడి మృతి
కాకినాడ ఆస్పత్రిలో దుర్ఘటన కాకినాడ: తన చదువు కన్నవారికి భారం కాకూడదని భావించి డబ్బు సంపాదించాలని పనికి వెళ్లిన బాలుడు కాన రాని లోకాలకు వెళ్లాడు. పుస్తకాలు కొనుక్కోవడానికి పనిలో చేరిన అతడిని లిఫ్ట్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన కాకినాడలో గురువారం జరిగింది. స్థానిక జగన్నాథపురం రామారావుపేటకు చెందిన మోసా రాంబాబు లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు అశోక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు రమేష్ (14) ఎంఎస్ఎన్ చార్టీస్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పుస్తకాలు కొనుక్కునేందుకు అవసరమైన డబ్బు తానే సంపాదించాలనుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాంటీన్ కాంట్రాక్టర్ దగ్గర 15 రోజుల కిందట పనిలో కుదిరాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రమేష్ నాలుగో అంతస్తులో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌కు, లిఫ్ట్ గోడకు మధ్య ఇరుక్కుపోయాడు. రక్తపు చుక్కలు నేలపై పడడం గమనించిన ఆస్పత్రి సిబ్బంది పరిశీలించగా, లిఫ్ట్‌కు, గోడకు మధ్య ఇరుక్కున్న రమేష్ అప్పటికే ప్రాణాలు వదిలాడు. లిఫ్ట్ మెకానిక్‌లు రమేష్ మృతదేహాన్ని బయుటకు తీశారు. ఆస్పత్రి యూజవూన్యం వల్లే రమేష్ మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటావుని ఆస్పత్రి యూజవూన్యం హామీ ఇవ్వడంతో శాంతించారు.