బిడ్డ కోసం అపర కాళిలా..!
తన బిడ్డకు అపాయం వస్తోందంటే.. తల్లి ఊరుకుంటుందా? అపరకాళిలా మారి ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదూ. మనుషులే కాదు.. కోతులు కూడా అలాగే చేస్తాయని మరోసారి రుజువైంది. బోర్నియా ప్రాంతంలోని అడవుల్లో ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిద్దామని వెళ్లి రష్యా ఫొటోగ్రాఫర్ జూలియా సుండుకోవాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కోతి జాతికి చెందిన ఒరాంగుటాన్.. తన బిడ్డ మీదకు ఓ అడవిపంది వస్తుంటే దాన్ని కర్రతో తరిమి తరిమి కొట్టింది.
పిల్ల ఒరాంగుటాన్ మీద దాడి చేద్దామని వచ్చిన అడవిపందిని చూసి... తల్లి వెంటనే అడవిలో ఉన్న కట్టెపుల్ల తీసుకుని.. అడవిపంది ముఖం మీద కొట్టింది. దాన్ని తరిమి కొట్టేందుకు తనకు చేతనైన అన్ని ప్రయత్నాలు చేసింది. పెద్దపెద్దగా అరుస్తూ దాన్ని కర్రతో భయపెడుతూ చెట్టు కొమ్మలను విరిచి దాని మీద వేయడం మొదలుపెట్టింది. ఈ దృశ్యాలన్నింటినీ రష్యా ఫొటోగ్రాఫర్ చకచకా తన కెమెరాలో బంధించారు. ఆ తల్లి ఒరాంగుటాన్ దెబ్బకు భయపడిన అడవిపంది.. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటూ అక్కడి నుంచి చల్లగా జారుకుంది.