తల్లీబిడ్డ ‘క్షేమం’ కాదు..
కాన్పు జరిగింది. ఆపరేషన్ ధియేటర్ నుంచి నర్సు బయటికొచ్చి.. ‘గాబరా పడొద్దు.. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమమే’ అని చెబుతుంది. ఇలాంటి సీన్లను సినిమాల్లో మనమెన్నో చూశాం. కానీ.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తల్లీబిడ్డ ఇక్కడ ‘క్షేమం’గా లేరు. మాతాశిశువుల మరణ మృదంగం సర్కారు చెవికి వినపడటం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా, ఏరియా ఆసుపత్రిని 100 పడకలుగా, జిల్లా కేంద్ర ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ స్థాయికి పెంచాలని కలలు కంటున్న ప్రభుత్వం వాస్తవానికి మాత్రం గ్రామాల్లో కనీస వైద్య చర్యలపై దృష్టిపెట్టట్లేదు.
700 పీహెచ్‌సీలు, 3 వేలకుపైగా ఉప వైద్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రులున్నా.. పలు చర్యలు చేపడుతున్నా మాతాశిశు మరణాలు ఆగట్లేదు. - సాక్షి, హైదరాబాద్
ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువుల కన్నుమూత...
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువులు పుట్టిన కొన్ని రోజులకే మృత్యువాతపడుతున్నారు. ప్రసవం సమయంలో ప్రతి లక్ష మందిలో 92 మంది కన్నుమూస్తున్నారు. ఈ మరణాల రేటు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ర్టంలోనే ఎక్కువగా ఉంది. కేరళలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 12 మంది శిశువులు మరణిస్తుండగా కర్ణాటకలో 32 మంది, తమిళనాడులో 21 మంది మరణిస్తున్నారు.
అలాగే కేరళలో ప్రతి లక్ష మందిలో 68 మంది తల్లులు మరణిస్తుండగా తమిళనాడులో 90 మంది చనిపోతున్నారు. జిల్లాలవారీ గణాంకాలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 53 మంది మరణిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి లక్ష మంది తల్లుల్లో 152 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ శిశు మరణాలు వెయ్యికి 20 ఉండగా తల్లుల మరణాల రేటు ప్రతి లక్షకు 71గా నమోదవడం గమనార్హం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల కొరత...
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒక గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, అనస్తీషియన్ (మత్తు మందు ఇచ్చే వైద్యుడు) ఉండాల్సి ఉండగా అనస్తీషియన్ల కొరత ఉంది. దీంతో సిజేరియన్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తి మరణాలు సంభవిస్తున్నాయి. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు తప్పనిసరిగా గర్భిణులను 2, 3 రోజులకోసారైనా పరిశీలించాల్సి ఉన్నా వాస్తవానికి ఆ పరిస్థితి లేనేలేదు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా అనేక వైద్య సేవలకు రూ. కోట్లు కేటాయిస్తున్నా అవి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న మాతాశిశు మరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ముందుకు రావాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
మరణాలకు కారణాలివీ..
⇒ గ్రామాల్లో తల్లులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండటం, ప్రసవ సమయంలో తల్లికి అవసరమైన రక్తం/సంబంధిత గ్రూపు దొరక్కపోవడం వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
⇒ చిన్న వయసులో పెళ్లిళ్లు జరిగి గర్భం దాల్చడం వల్ల కూడా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
⇒ గర్భిణుల్లో తలెత్తే బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించడంలో వైద్య లోపాలు కూడా కారణంగా ఉంటోంది.
⇒ 51%మంది గ్రామీణ గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందట్లేదు.
⇒ గర్భస్త పిండాల ఎదుగుదల/లోపాల గురించి గర్భిణులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోకపోవడం నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.