ఈ అమ్మాయి మాటలకు.. సీఎం కంటతడి
అహ్మదాబాద్: ఆడశిశువుల భ్రూణహత్యలపై తొమ్మిదో తరగతి విద్యార్థిని అంబికా గోహెల్ చేసిన భావోద్వేగ ప్రసంగం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఖేడా జిల్లా మహుదా తాలూకాలోని హెరంజీ గ్రామానికి చెందిన అంబిక ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది.
భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబిక చదవి వినిపించింది. తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, గాలిని పీల్చాలని ఉంటుందని, అయితే ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదంటూ మృత శిశువు ఆవేదన చెందుతున్నట్టుగా అంబిక ప్రసంగించింది. 'నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తించుకో. కూతురు లేకుంటే ఇల్లు ఇల్లే కాదు' అని మృతశిశువు బాధను అంబిక తన మాటల్లో చెప్పింది.
అంబిక మాట్లాడుతుండగా.. భావోద్వేగానికి గురైన అమ్మాయిలు సభలో ఏడ్చేశారు. అంబిక ప్రసంగం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్.. ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందని అంబిక సీఎంతో చెప్పారు.