బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి
ఐక్యపోరాటాలతోనే సాధించుకోవాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
పెద్దపల్లిరూరల్: బీసీలకు రాజ్యాధికారం వచ్చిననాడే అందరూ అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని, అందుకు ఐక్య పోరాటాలే మార్గమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పెద్దపల్లిలో బుధవారం జరిగిన బీసీల చైతన్యసదస్సులో మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలలో విభేదాలు సృష్టించి ఓట్లకోసమే అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితే రాజ్యాధికారం రావడం కష్టమేమీ కాదన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సాగుతున్న కుల ఉద్యమాలే నిదర్శనమని గుర్తుచేశారు. చట్టసభలతోపాటు స్థానిక సంస్థలలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతాలు పెంచుకున్న పాలకులు బీసీ విద్యార్థులకిచ్చే ఉపకారవేతనాలను ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు.
దొరల పాలనకు చరమగీతం పాడాలని, అందుకు ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్, పెద్దపల్లి నుంచే నాంది కావాలన్నారు. బీసీలకు సంక్షేమపథకాల అమలులోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నితే ఆందోళనలు చేసి సాధించుకున్నామన్నారు. బీసీలకు కళ్యాణలక్ష్మిని కూడా వర్తింజేసేలా ప్రభుత్వంతో పోరాడామని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు అరుణ్‌కుమార్, చేతి ధర్మయ్య, శ్రీధర్‌రాజు, చాట్ల మల్లేశం, నోమూరి శ్రీధర్‌రావు, రాజేశ్వరి, రాజేందర్, రణధీర్‌సింగ్, రామగిరి ప్రవీణ్, శ్రీనివాస్, బుచ్చిబాబు పాల్గొన్నారు.