చేత్తో రెండు సార్లు విదిలిస్తే ఫోను కెమెరా అయిపోతుంది
ఒకప్పుడు పేజర్లు, తరువాత మొబైల్ రంగంలో బాణంలా దూసుకుపోయిన మోటరోలా తరువాత చతికిలబడిపోయింది. చాలా రోజులు కనిపించని, వినిపించని మోటరోలా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త సంచలనం మోటో ఎక్స్ తో మళ్లీ ముందుకొచ్చింది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది షాపుల్లో దొరకదు. దీన్ని కావాలంటే ఈ కామర్స్ రారాజు ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసి తెప్పించుకోవాల్సిందే. దీని ధర రూ. 23,999. మోటో ఎక్స్ నలుపు, తెలుపు, టర్కోయిజ్, నీలి, ఎరుపు రంగుల బ్యాక్ పానెల్స్ తో లభిస్తాయి. ఇవే కాక వుడ్ ఫినిష్ తో (వాల్ నట్, టేకు) కూడా బ్యాక్ పానెల్ కూడా లభిస్తున్నాయి. అయితే వుడ్ ఫినిష్ వెరైటీల ధర మాత్రం రూ. 25,999.
ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ వద్ద తెలుపు, నలుపు రంగుల బ్యాక్ పానెల్స్ ఉన్న మోటో ఎక్స్ మాత్రమే లభ్యమౌతోంది. మిగతా రంగులు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఏప్రిల్ రెండో వారానికి చేతికి అందుతాయి. ఫ్లిప్ కార్ట్ వాయిదాలపై ఈ ఫోన్ ను కొనేవారికి వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. దీంతో పాటు బాడీ కేసుల పై 70 శాతం కూడా ఇస్తోంది.
మోటో ఎక్స్ హార్డ్ వేర్ షోకుల్ని చూపించకుండా వాడకంలో అనుభవాన్నే తన అమ్మకానికి ప్రాతిపదికగా ఎంచుకుంది. ఈ ఫోన్ కి 4.7 అంగుళాల హెచ్ డీ స్క్రీన్, 1.7 జీ హెచ్ జడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 10 మెగాపిక్సెల్ కెమెరా, 2 జీబీ ర్యామ్ లు ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీనికి వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉంటుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది హ్యాండ్ సెట్ ను వాడకున్నా మనం నోటితో ఆదేశాలిస్తే పాటిస్తుంది. కెమెరాకి వెళ్లాటంటే ఫోన్ ను రెండు సార్లు విదిలిస్తే చాలు. మెయిల్స్, మిస్డ్ కాల్స్ కోసం యాక్టివ్ డిస్ ప్లే ఏర్పాటు ఉంటుంది.
ఇప్పుడు ఇది నోకియా లూమియా 1320, సోనీ ఎక్స్పీరియా టీ అల్ట్రా, సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ వంటి ఫోన్లకు ఇది ప్రధాన పోటీదారు అవుతుంది.