సరిహద్దులో కాల్పుల కలవరం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాక్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ శుక్రవారం కూడా సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు.
ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. గురువారం సాయంత్రం హీరానగర్, సాంబా సెక్టార్ల వద్ద గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకూ పాక్ రేంజర్లు మోటార్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లోని ఒక డజను ఇళ్లు నాశనం కాగా, మరో రెండు డజన్ల ఇళ్లు స్వల్పంగా ధ్వసం అయ్యాయి.
పాకిస్తాన్ రేంజర్లకు గట్టి జవాబిచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సరిహద్దు గ్రామాలను ధ్వంసం చేశారు. సుందర్బని, పల్లన్ వాలా, నౌషెరా సెక్టార్లలో శుక్రవారం ఉదయం నుంచి పాక్ కాల్పులు ప్రారంభించింది. దీంతో రంగంలోకి దిగిన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కు ధీటుగా బదులిస్తున్నాయి. కాల్పులకు సాంకేతికంగా బలమైన ఆయుధాలను పాకిస్తాన్ ఉపయోగిస్తున్న రక్షణ శాఖ పీఆర్వో తెలిపారు.