షెర్పాలపై ఎవరెస్టంత నిర్లక్ష్యం!
ఎవరెస్టు పర్వతారోహణ ఇప్పుడు వ్యాపారమయమై పోయింది. పర్వతారోహణ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. అందుకు కారణమైన షెర్పాల సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. నేపాల్ ప్రభుత్వమైతే సరేసరి.
షెర్పాలే లేకపోతే హిమాలయ పర్వతారోహణ లేనేలేదు. వీరు లేకపోతే ఒక ఎడ్మండ్ హిల్లరీ... ఒక బచేంద్రీపాల్... ఎందరో... ఇంకెందరో పర్వతారోహకులు అనామకులుగా మిగిలిపోయేవారు. వీరికి ఇతర ఆదాయ వనరుల్లేవు. వీరు అల్ప సంతోషులు. కొండలెక్కడం వారి సహజ లక్షణం. పుట్టేది అక్కడే... కన్నుమూసేది అక్కడే. ఎవరెస్టు అధిరోహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చేవారు పర్వతారోహణ శిక్షణ సంస్థలకు పదులు, వందల్లో డాలర్లు చెల్లిస్తారు. ఈ మొత్తంలో కొంత దళారులకు, మరికొంత నేపాల్ ప్రభుత్వానికి పోతుంది. చివరకు నేపాలీ షెర్పా గైడ్లకు దక్కేది వెయ్యి డాలర్లే. ఇది రెండు నెలల సీజన్లో వచ్చే సంపాదన. మిగిలిన పది నెలలూ చిన్నాచితకా పనులు చేసుకుంటేనే పూట గడుస్తుంది.
ఎవరెస్టు పర్వతారోహణ ఇప్పుడు వ్యాపారమయమై పోయింది. పర్వతారోహణ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. అందుకు కారణమైన షెర్పాల సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. ప్రభుత్వమైతే సరేసరి. పర్వతారోహకుల బృందాల నుంచి పదివేల డాలర్ల చొప్పున వసూలు చేసే నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఎవరెస్టు దుర్ఘటనలో మృతి చెందిన షెర్పాల కుటుంబాలకు అంత్యక్రియల కోసమంటూ 400 డాలర్లు మాత్రమే విదల్చడం షెర్పాల ఆగ్రహానికి కారణమైంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోంచి ఎవరెస్టును అధిరోహించేం దుకు ప్రయత్నించి 250 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ 1990లో 5.6 శాతం ఉన్న మరణాల సంఖ్య 2000 కల్లా 1.5 శాతానికి తగ్గిపోయింది.
ఈ ఘనతంతా షెర్పాలకే దక్కుతుంది. అపార ధైర్యసాహసాలు, కొండాకోనల్లోకి సునాయాసంగా ఎగబాకే శరీర దారుఢ్యం, ప్రాణాలకు తెగించి సాహసికుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అందుబాటులో ఉన్న షెర్పా గైడ్లు, అందించే సేవలను బట్టి కొన్ని పర్వతారోహణ సంస్థలు ఒక్కొక్క సాహసికుడి నుంచి 40 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు విదేశీ గైడ్లను ఏర్పాటు చేస్తున్నాయి. విదేశీ నిపుణులు, మం చి ఆహారం, ఫైవ్‌స్టార్ వంటమనిషిని సమకూరుస్తున్నారు.కొన్ని సంస్థలు అనుభవమున్న వారినే పర్వతారోహణకు అనుమతిస్తాయి. నిబంధనల మేరకు ఒకేసారి కనీసం 8 వేల మీటర్ల చొప్పున 41 సార్లు పర్వతారోహణను పూర్తి చేసుకున్న వారినే ఎవరెస్టు శిఖరారోహణకు అనుమతిం చాలి.
జీవితంలో ఎప్పుడూ పర్వతారోహణ చేయని వాళ్లు కూడా ఎవరెస్టును అధిరోహించేందుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు సాహసికులు తప్పుడు అర్హతలు చూపిస్తున్నారు. వీరిని ప్రోత్సహిస్తున్న కొన్ని పర్వతారోహణ సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని అమెరికాలో జన్మించి నేపాల్ రాజధాని కఠ్మాండులో స్థిరపడిన ఎలిజబెత్ హాల్వే (90) అంటున్నారు. శారీరక సామర్థ్యం, అనుభవం లేని సాహసికుల్ని అనుమతించడంతో వారి రక్షణ షెర్పాల ప్రాణాల మీదకొస్తోంది.
పర్వతారోహణను పూర్తి చేసుకుని బేస్‌క్యాంప్ నుంచి పర్వతారోహకుడు తిరిగి బయల్దేరేవరకూ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అనుక్షణం షెర్పాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వారు మార్గాలను ఏర్పాటు చేయడంలో, తాళ్లు, టెంట్లు, ఆక్సిజన్ సీసాలను మోసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు.
ఎవరెస్టు పర్వతారోహణ కార్యక్రమాలను నిర్వహించే వాంగ్చూ షెర్పా ఒక్కొక్క సాహసికుడి వెంట ఇద్దరు షెర్పా గైడ్లను పంపినందుకు 37 వేల డాలర్లు వసూలు చేస్తాడు. ఇందులో అతనికి రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకూ లాభం ఉంటుంది. డబ్బు వెదజల్లితే చాలు... ఎవరెస్టు ఎక్కేయొచ్చు అనే భావనలో కూడా చాలామంది సాహసికులుంటారు.
పర్వతారోహణ సంస్థలకు కూడా కావలసింది ఇలాంటి వారే. అందుకోసమే నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. పర్వతారోహణకు ఆసక్తి చూపేవారికి అర్హత లున్నాయో లేదో తెలుసుకోకుండా... డబ్బు చెల్లిస్తే చాలు తీసుకెళ్తున్నాయి. అయితే, అన్ని సంస్థలూ ఇలాగే చేస్తున్నాయని అనలేం. నేపాల్ పర్యాటక రంగంలో పర్వతారోహణ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం పర్వతారోహణ ద్వారా వస్తున్న ఆదాయమే దేశ స్థూల జాతీయోత్పత్తిలో నాలుగు శాతం ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా దేశంలో పేదరికం పెరుగుతూనే ఉంది. పర్వతారోహణ సంస్థలకు ఎవరెస్టు కాసులు కురిపించే కామధేనువైనా... షెర్పాల సంక్షేమం మాత్రం అంతంతమాత్రమే.
-ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి(బాలు)