తుపాకీతో కాల్చి.. గొడ్డలితో నరికి..
నోయిడాలో నల్లగొండ విద్యార్థి సందేశ్ దారుణ హత్య
హరియాణాకు చెందిన ఇద్దరు స్నేహితులే హంతకులు
హైదరాబాద్‌కు మృతదేహం తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నల్లగొండ విద్యార్థి సందేశ్ శనివారం సాయంత్రం హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులు అతన్ని పిస్టల్‌తో కాల్చి ఆపై గొడ్డలితో నరికి కిరాతకంగా హతమార్చారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి, సందేశ్ రూమ్మేట్ నదీమ్ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే సహకార బ్యాంకు ఉద్యోగి రామరాజు శ్యాంసుందర్‌రావు, రూప దంపతుల రెండో కుమారుడైన సందేశ్ (19) నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం హాస్టల్లో ఉన్న సందేశ్... ద్వితీయ సంవత్సరం ఓ అపార్ట్మెంట్లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
పర్యాటక నిర్వహణ కోర్సు చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీలు శనివారం సాయంత్రం సందేష్ ఉంటున్న 1804 నంబర్ గదికి వెళ్లి కాలింగ్‌బెల్ కొట్టారు. సందేష్ తలుపు తెరవగానే అమన్ పిస్టల్‌తో కాల్చగా మౌంటీ గొడ్డలితో నరికాడు. అనంతరం వారు తనపైనా దాడికి యత్నించగా తప్పించుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు నదీమ్ చెప్పాడు. కాల్చొద్దని సందేష్ బతిమిలాడినా అమన్ వినలేదన్నాడు. స్టేషన్ హౌస్ అధికారి జహీర్‌ఖాన్ మాట్లాడుతూ పరారీలో ఉన్న అమన్, మౌంటీలు హర్యానాలోని పానిపట్‌కు చెందినవారని చెప్పారు. సందేష్‌కు అమన్‌కు మధ్య రెండు నెలల కిందట గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి వారిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారని... ఈలోగా హత్య జరగడం మిస్టరీగా ఉందన్నారు.
సందేష్, అమన్‌ల ఫోన్‌కాల్స్ వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. కాగా, కుమారుడి హత్య విషయం తెలుసుకున్న సందేష్ తండ్రి శ్యాంసుందర్‌రావు శనివారం రాత్రి నోయిడా చేరుకున్నారు. సందేష్ మృతదేహానికి ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం జరిగింది. హైదరాబాద్‌లోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్న శ్యాంసుందర్‌రావు సోదరుడి ఇంటికి సందేష్ మృతదేహాన్ని ఆదివారం రాత్రి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోనే సందేష్ అంత్యక్రియలు జరపనున్నారు.