పోర్టర్ ఉద్యోగాలకు ఎంఫిల్, పీజీ గ్రాడ్యుయేట్ల పోటీ
మహారాష్ట్రలో ఐదు హమాలీ (పోర్టర్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికోసం అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు ఏకంగా 2,500 మంది దరఖాస్తు చేశారు. నాలుగో తరగతి పాసైతే సరిపోయే ఈ పరీక్ష కోసం ఏకంగా 984 మంది గ్రాడ్యుయేట్లు, 253 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేశారట. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం కుదరదని, అందుకే రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేస్తామని సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజేంద్ర మంగ్రుల్కర్ చెప్పారు.
ఆగస్టు నెలలో ఈ పరీక్ష జరగనుంది. అందులో ఐదోక్లాసు చదువుతూ మానేసిన వాళ్లు, లేదా అసలు ఐదో తరగతి కూడా చదవని వాళ్లతో కలిసి గ్రాడ్యుయేట్లు, పీజీలు, ఎంఫిల్ లు పరీక్ష రాస్తారన్న మాట. సాధారణ గణితానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉండే ఇలాంటి పరీక్షలో వీళ్లంతా పోటీపడితే.. ఇక మామూలు వాళ్లకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది అనుమానమే. మొత్తం 2,500 మంది దీనికి దరఖాస్తు చేస్తే వాళ్లలో కేవలం 177 మందికి మాత్రమే పదోతరగతి కంటే తక్కువ అర్హత ఉందట. దీన్నిబట్టే రాష్ట్రంలో నిరుద్యోగం పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.