కుక్కెలో మడెస్నాన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎవరెంతగా వ్యతిరేకించినా దక్షిణ కన్నడ జిల్లా కుక్కె సుబ్రమణ్యలో శుక్రవారం మడెస్నానను నిర్వహించారు. ఎంగిలి విస్తర్లపై పొర్లు దండాలు పెట్టే మడెస్నానను దురాచారంగా అనేక మంది అభివర్ణించి, వ్యతిరేకించినప్పటికీ 202 మంది పురుషులు, మహిళలు దీనిని ఆచరించారు. నిడుమామిడి మఠానికి చెందిన శ్రీ వీరభద్ర చన్నమల్ల స్వామీజీ నేతృత్వంలో బెంగళూరులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠాధిపతులు సత్యాగ్రహం చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
స్నానాలు చేశాక తడి బట్టలతో బ్రాహ్మణులు భోంచేసి విడిచి పెట్టిన అరటి ఆకులపై పొర్లు దండాలు పెట్టే మడెస్నానపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు పొర్లు దండాలు పెట్టే అవకాశాలున్నాయి. అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణులు కూడా ఎంగిలి విస్తర్లపై పొర్లు దండాలు పెట్టడం ఇక్కడి ఆచారమని ఆలయ వర్గాలు తెలిపాయి.
చర్మ వ్యాధులు నయమవుతాయని, కష్టాల నుంచి గట్టెక్కవచ్చనే మూఢ నమ్మకంతో నిర్వహిస్తున్న ఈ దురాచారాన్ని శాశ్వతంగా నిషేధించాలని రాష్ర్ట వెనుకబడిన తరగతుల చైతన్య వేదికతో పాటు పలువురు మఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా భగవంతునికి ప్రసాదంగా సమర్పించిన ఆహార పదార్థాలపై పొర్లు దండాలు పెట్టడానికి అనుమతినిస్తూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది నవంబరులో జారీ చేసిన ఆదేశాలను, అదే ఏడాది డిసెంబరులో సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.