మిస్టర్ సెలెబ్రిటీ మూవీ రివ్యూ
సీనియర్ కథ, మాటల రచయిత పరచూరి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. ఆయన మనవడు సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా చేశాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కి చెందిన సోషల్ యాక్టివిస్ట్ లలిత (శ్రీ దీక్ష)కు వింత అనుభవం ఎదురవుతుంది. ఆమెపై ఎవరో అత్యాచారానికి పాల్పడినట్లు కల వస్తుంది. పదే పదే అలాంటి కలలే రావడంతో డాక్టర్ని సంప్రదిస్తుంది. ప్రెగ్నెంట్ టెస్ట్ చేయగా..నిజమనే తెలుస్తుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కలలో వచ్చినవాడి పోలీకలతో బొమ్మను గీస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఫేమస్ యూట్యూబర్ లక్కీ(సుదర్శన్) అని తెలుస్తుంది. ఎస్సై నరహరి (రఘుబాబు) అతన్ని అరెస్ట్ చేసి.. ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత లక్కీ నేరస్థుడు కాదని తెలుస్తుంది. కానీ మీడియా ఆ విషయాన్ని పట్టించుకోదు. అసలు లలితకు అలాంటి కలలు వచ్చేలా చేసిందెవరు? ఈ కేసులో లక్కీని ఎందుకు ఇరికించారు? వీరిద్దరితో పాటు ఎస్సై సరహరిని కూడా ఫేమస్ చేసి చంపుతానంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? పద్మశ్రీ గ్రహిత, సైంటిస్ట్ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? ఈ కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది అని ఊరికే అనలేదు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేలోపే అది దేశమంతా వైరల్ అవుతుంది. కొన్నిసార్లైతే అసలు నిజాన్ని బయటపెట్టినా జనాలు వినే స్థితిలో ఉండట్లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా పక్కవారిపై నిందలు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘మిస్టర్ సెలెబ్రిటీ. ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం వల్ల ఎంత నస్టం జరుగుతుంది? తెలియని తప్పుకు నిందలు వేస్తే..వాళ్లు ఎలా బాధపడతారు అనేది ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపైకి తీసుకు రావడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు.ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగుతుంది. రూమర్ల వల్ల ఎవరు ఎలా ఇబ్బందులు పడతారన్నది ఓ మూడు సీన్లు చూపించాడు. ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్.. ఆ తరువాత సాంగ్.. ఆపై హీరోయిన్ పరిచయం, ఆమె సమస్య గురించి చెప్పడం, లలిత ఇచ్చిన ఫిర్యాదుతో లక్కీని నరహరి అరెస్ట్ చేయడం.. ఇలా సీన్లు ముందుకు వెళ్తూనే ఉంటాయి. లక్కీ, లలిత, నరహరి పాత్రలతోనే ఫస్ట్ హాఫ్ గడుస్తుంది. ఇంట్రవెల్‌కు ట్విస్ట్ వస్తుంది. ఓ ముసుగు వ్యక్తి ఇదంతా చేయిస్తాడని తెలుసుకుంటారు. దీంతో సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. వరలక్ష్మీ పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. సుదర్శన్‌కి ఇది తొలి సినిమా. అయినా బాగా నటించాడు. కొన్ని సీన్లలో కాస్త తడబడినా.. కొన్ని చోట్ల అయితే అనుభవం ఉన్నవాడినా నటించాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ చెప్పడంలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ శ్రీ దీక్షకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టు ఆమె కూడా బాగానే నటించింది. నరహరి పాత్రలో రఘుబాబు ఆద్యంతం నవ్వించే ప్రయత్నించాడు. వరలక్ష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారనిపిస్తుంది. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతికతంగానూ ఈ సినిమా మెప్పిస్తాయి. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో ఈ మూవీని చక్కగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు పెట్టిన డబ్బులు, పడిన కష్టం అయితే తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.