టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి
సాక్షి, బోథ్(మంచిర్యాల) : ఆర్టీసీ కార్మికుల సమస్యను పరష్కరించకుండా జాప్యం చేస్తూ మధ్య తరగతి, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, తుడుం దెబ్బ, బీజేపీ, కాంగ్రెస్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడల స్వామి మాట్లాడారు. ఆర్టీసీలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను సీఎం సెల్ఫ్ డిస్మిస్ చేస్తామని ప్రకటించడం ఆయన దొరతనానికి నిదర్శనమన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మాట్లాడుతూ.. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడే మానాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బుర్గుల మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మాదిగ స్డూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ మాట్లాడుతూ సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు మద్దతు తెలిపి ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు బుచ్చి బాబు మాట్లాడుతూ ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వమే కారణమన్నారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు అత్రం మహేందర్, గెడం నగేందర్, బీజేపీ నాయకులు కదం బాబారావు, మాదవ్ అమ్టె, మచ్చనారయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు దుబాక సూభాష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాథోడ్ ప్రకాశ్, శ్యామ్, జ్ఞానోబా, గంగాధర్, ఆర్టీసీ కార్మికులు గణపతి, భూమారెడ్డి, బాబాన్న, హైదర్, మోహన్‌రెడ్డి, కళ, పద్మ, ఫాయిమ్, దేవన్న, పాండురంగ్, స్వామి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.