నమ్మి ఓట్లేస్తే.. నట్టేట ముంచారు
సీఎం చంద్రబాబుపై ఏపీ ఎమ్మార్పీఎస్ నేతల ధ్వజం
మండపేట :
ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చి హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు మాదిగలను మోసగించారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాదిగ ధ్వజమెత్తారు. నమ్మి ఓట్లేసిందుకు నట్టేట ముంచిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ప్రారంభమైన మాదిగల సంకల్ప చైతన్య రథయాత్ర శనివారం జిల్లాకు చేరుకుంది. జిల్లా అధ్యక్షుడు బుంగ సంజయ్ ఆధ్వర్యంలో మండపేట మీదుగా రాజమండ్రి వరకు ఈ యాత్ర సాగింది. మండపేట ఎస్సీ కాలనీలో సంజయ్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ వర్గీకరణతోనే మాదిగలు, ఉపకులాల అభ్యున్నతి సాధ్యమన్నారు. వర్గీకరణ సాధనకు మాదిగలు, ఉపకులాల వారిని చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంకల్ప చైతన్య రథయాత్ర చేస్తున్నామన్నారు. అనంతరం భారీ ర్యాలీగా రాజమండ్రి వైపు రథయాత్ర సాగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి ఇజ్రాయేల్, మల్లవరపు వెంకట్రావు, ఉప్పలపాటి నెపోలియన్, పిప్పర సంపతరావు, బొత్స ఏసురెల్లి, చిర్రా శ్రీను, మోరంపూడి మధు, ముమ్మిడివరపు సుబ్బు, కొమ్ము సత్తిబాబు, చుక్కా ఏసు తదితరులు పాల్గొన్నారు.