'ప్రతికూల భావాలొద్దు.. లక్ష్యంపైనే గురి'
హైదరాబాద్: తనను తాను ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోలేదని ఆ ఆలోచన కూడా ఎప్పుడూ తన మనసులోకి రానివ్వలేదని ఈ ఏడాది సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ అన్నారు. ప్రతికూల భావాలవైపు ఏమాత్రం తన ఆలోచనను వెళ్లనివ్వలేదని, ఒకే లక్ష్యాన్ని నిర్ణయించుకునే ప్రతిక్షణం దానినే మననం చేసుకునేదానిని చెప్పారు. శుక్రవారం మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలను ఇరా సింఘాల్ సందర్శించారు. ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన ఆమెను కళాశాలలోని గణిత విభాగం ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హాజరై విద్యార్థులకు మంచి ఇన్సిపిరేషనల్ స్పీచ్ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులంతా కరతల ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు వచ్చిన సందర్భంగా ఆమె ముగ్గురు అంగవైకల్య విద్యార్థులతో పరిచయం చేసుకునే సందర్భంలో కొంత ఆసక్తి కనబరిచారు. ఎలాంటి కష్టాలు వచ్చిన చదువును మధ్యలో ఆపేయోద్దని ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. గొప్ప శిఖరాలను మీరు(వికలాంగులు) అధిరోహించాలని, తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పుష్పలీలా మాట్లాడుతూ ఇరా సింఘాల్ ను అభినందించారు. ఆమె విజయాలను కొనియాడుతూ ప్రతి విద్యార్థి ఆమె నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆమెకు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.