ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు, దివంగత ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా కళాప్రపూర్ణ గుండె సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. కాగా ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే కళాప్రపూర్ణ మృతి చెందారు. దీంతో ఏడాది వ్యవధిలోనే వారి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.
కాగా ఎంఎస్ నారాయణ భీమవరంలో మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా పనిచేశారు.