ఎం.ఎస్. విశ్వనాథన్, వాణీ జయరాంలకు పీబీ శ్రీనివాస్ పురస్కారం
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఎం.ఎస్. విశ్వనాథన్, ప్రముఖ గాయని వాణీ జయరాంలను పీబీఎస్ పురస్కారం వరించింది. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ స్మారకార్థం ఏర్పాటుచేసిన ఈ అవార్డును ఈనెల 29వ తేదీన వారిద్దరికీ అందజేస్తారు. పి.బి. శ్రీనివాస్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మరణించిన విషయం తెలిసిందే.
నేత్ర చికిత్స సంస్థ అరుణ నిత్యాగోపాల్ ఫౌండేషన్ రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తోంది. సీనియర్ నిర్మాత డి. రామానాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. డ్రమ్స్ మాంత్రికుడు శివమణి ప్రదర్శన కూడా ఆ రోజు రవీంద్రభారతిలో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.