జిల్లాలో నేరాల నివారణకు కృషి
రాయచూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో దోపిడీలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తామని ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఎంఎన్.నాగరాజ్ తెలిపారు. ఆయన గురువారం ఏఎస్పీ అశోక్, రూరల్ సీఐ రమేష్ మేటితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా అత్యంత విలువైన బంగారు నగలు, నగదు అవసరమైతే తప్ప ఇంట్లో పెట్టుకోరాదని, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు.
జిల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలు, దొంగతనాలపై దర్యాప్తునకు డీఎస్పీ సిప్పార్, డీసీఆర్బీ కరుణేష్గౌడ సారథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బళ్లారి నగరంలో, తోరణగల్లులో జరిగిన దోపిడీ ఘటనల్లో దుండగులు వాడిన మారణాయుధాలు, వారి సంఖ్య, జిల్లాలోని లింగసూగూరులో జరిగిన దోపిడీ ఘటనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో బళ్లారి జిల్లా ఎస్పీతో సంప్రదిస్తున్నామన్నారు. దొంగల ఆట కట్టించేందుకు సమన్వయంతో పని చేయాలని తాము నిర్ణయించుకున్నామన్నారు.
ఇది ఒకే ముఠా పనే నా? అన్నది త్వరలో నిగ్గు తేలుస్తామన్నారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం కోసం కర పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసి తగినంత చైతన్యం తెస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇరుగు పొరుగు కాపలా సమితిని ఏర్పాటు చేశామని, ఇందులో యువజనుల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. రాయచూరులోని జహీరాబాద్ ధనలక్ష్మి లేఔట్లో మంగళవారం పట్టపగలు జరిగిన దోపిడీకి సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు 300 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఘటన జరిగిన మరుసటి రోజే గుడ్‌మార్నింగ్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతంలోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో 8 శాతం పోలీస్ సిబ్బంది కొరత ఉందన్నారు.
అక్రమ మద్యం,ఇసుక అక్రమ రవాణను అరికట్టేందుకు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆటో డ్రైవర్లు వినియోగదారులను వంచించే ప్రకటనలపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.వివిధ వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకుని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బళ్లారి అక్రమ గనులలో తమ పేరు ఉంది కదా? అన్న ప్రశ్నకు ఏదో ఒక పత్రిక అలా రాసిందన్నారు. బళ్లారిలో 8 నెలలు పాటు మాత్రమే తాను ఎస్పీగా పని చేశానన్నారు.