నిండా ముంచిన ‘స్వర్ణ’
* నీటి ముంపుతో కుదేలైన వరి రకం
* వరుస తుపాన్లతో డెల్టా రైతుకు తీవ్ర నష్టం
* డెల్టాకు నీటి విడుదల జాప్యంతోనూ దెబ్బ
* ముంపు తట్టుకునే రకాల ఆవశ్యకత
సాక్షి, హైదరాబాద్: సమయానికి విడుదల కాని కాల్వ నీరు... మరోవైపు అనువుగాని ‘స్వర్ణ’రకం వరి సాగు కారణాల వల్లే డెల్టా రైతు నిండా మునిగాడు. ‘స్వర్ణ’లాంటి అననుకూల రకాలను సాగు చేయడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగితే, కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో ఆలస్యం కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టం కలిగింది. గోదావరి జిల్లాల్లో కూడా కాల్వల ఆధునీకరణ పనులు, మరమ్మతులు లాంటి కారణాలతో కాస్త ఆలస్యంగా నీరు అందిన గ్రామాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. తుపాను సమయానికి కోతలు పూర్తికాని ‘స్వర్ణ’ వరి పూర్తిగా దెబ్బతింది. ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 వరి రకాల్లో నష్టం తక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో పర్యటించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం పరిశీలనలో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో జూన్ 13న నీరు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, కాళ్ల, ఉండి, భీమవరం తదితర మండలాల పరిధిలోని కాల్వల ఆధునీకరణ పనుల కారణంగా ఈ ప్రాంతాల్లో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. ఇలా ఆలస్యమైన చోట సాగైన ‘స్వర్ణ’ రకం వరి వరుస తుపాన్లకు పూర్తిగా దెబ్బతింది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కాల్వలకు నీళ్లు వచ్చే సమయానికే బోర్ల కింద నారుమళ్లు సాగు చేసుకుని జూన్ చివరి వారంలోపు నాట్లు వేశారు. ఈ పంటంతా తుపాన్ల నుంచి బయట పడింది. నాట్లు ఇంకొంత ఆలస్యమైన చోట తుపాను సమయానికి కోతలు పూర్తయ్యి కుప్పలు పడ్డాయి. ఇక్కడా నష్టం స్వల్పంగానే ఉంటుంది. నాటు ఇంకా ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రధానంగా ‘స్వర్ణ’రకం తుడిచిపెట్టుకు పోయింది.
పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా కింద దాదాపు 32 వేల ఎకరాల్లో వరి సాగు ఉంది. ఇక్కడ అక్టోబర్ మూడో వారంలో కానీ నాట్లు పడలేదు. తుపాను దెబ్బకు ఈ సాగు అంతా దెబ్బతింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 70 శాతం విస్తీర్ణంలో ‘స్వర్ణ’ రకం వరే సాగు చేశారు. తుపాను సమయానికి కోతలు పూర్తికాని అన్ని చోట్లా ఆ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఈ రెండు జిల్లాల్లోనే దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇందులో 70 శాతం అంటే దాదాపు 8 లక్షల ఎకరాల్లో ‘స్వర్ణ’ రకమే సాగయ్యింది. దీనికి తుపానులతో త్వరగా పైరు పడిపోయే స్వభావం ఉంటుంది. రెండు మూడు రోజుల ముంపుకే గింజ మొలకెత్తుతుంది.
కృష్ణా నీటి విడుదలలోనూ జాప్యమే
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి చివరి ప్రాంతానికి ముందు నీటిని వదలి, అక్కడ నుంచి పై ప్రాతాలకు నీటిని విడుదల చేస్తూ వస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ విధానం తలకిందులుగా అమలయ్యింది. జూలై 22న జూరాల నుంచి నీరు విడుదల చేశారు. జూలై 28న పోతిరెడ్డిపాడుకు నీరు విడుదలైంది. ఆగస్టు 2న సాగర్ కాల్వకు, 6న సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా నీటి విడుదలలో జరిగిన జాప్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
తుపాను తీవ్రత తక్కువ ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బ తింది. ‘హెలెన్’తో పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ పేర్కొన్న వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఇందులో 83 వేల ఎకరాల్లో తుపాను సమయానికే పంట రైతుల ఇళ్లకు చేరిపోయింది. పనలపై 91 వేల ఎకరాల్లో, కుప్పలేసిన వరి 94 వేల ఎకరాల్లో నీటి ముంపులో ఉంది. తుపాను ధాటికి 2.93 లక్షల ఎకరాల్లో వరి పడిపోయింది. కుప్పలేసిన వరిలో నష్టం పెద్దగా ఉండదు. పనలపైన, పడిపోయిన వరిలోనే నష్టం అధికంగా ఉంటుంది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనలపైన కానీ, కుప్పలేసిన వరి కానీ ఒక్క ఎకరా కూడా లేదు. గింజ గట్టిపడే దశలో ఉన్న దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వరి చేతికందకుండా పోయింది. ఇక్కడ ప్రధానంగా బీపీటీ 5204 రకం తుపానుకు ఎక్కువ దెబ్బతింది. మార్టేరు వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పీవీ సత్యనారాయణ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కీటక శాస్త్ర శాఖాధిపతి డాక్టర్ రమేష్ బాబు, తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త పి.నారాయణ రెడ్డి, సీడ్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ కేశవుల బృందం ఇటీవల తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించింది.
‘స్వర్ణ’ వద్దు... ఎంటీయూ 1121 మేలు
‘‘నీటి విడుదలలో అనిశ్చితి, ఎప్పుడు తుపాన్లు వస్తాయో చెప్పలేని పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి డెల్టాల్లో ‘స్వర్ణ’, బీపీటీ-5204 లాంటి రకాల సాగు మంచిది కాదు. నమ్మకమైన దిగుబడి, గింజ నాణ్యత ఉండటం తదితర లక్షణాలు ఉన్నా, తుపాన్లకు ఇవి తట్టుకోలేవు. మూడు, నాలుగు రోజులు నీటి ముంపులో ఉంటే గింజ మొలకెత్తుతుంది. డెల్టాలో ఈ రకాలు సాగు చేయడం అంటే ‘గాలిలో దీపం పెట్టినట్లే’. ఎంటీయూ 1121 అనే కొత్త వంగడం ఈ ప్రాంతంలో సాగుకు అన్నివిధాలా సరిపోతుంది. 125 రోజుల్లో కోతకొస్తుంది. అగ్గితెగులును తట్టుకుంటుంది. అన్నిటికీ మించి రెండు వారాలపాటు నీటిలో ఉన్నా గింజ మొలకెత్తదు.’’
- పీవీ సత్యనారాయణ, మార్టేరు వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త