ఫార్మా సిటీకి తక్షణమే మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుండటంపై రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సేకరణ సహా ఇతర అంశాల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సమీక్షించారు. టీఎస్ఐఐసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫార్మాసిటీకి తక్షణమే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడంతోపాటు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బిడ్‌లో ఉండాల్సిన అంశాలపై ముందస్తుగా కసరత్తు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫార్మాసిటీ కోసం రెవెన్యూ విభాగం ఇప్పటివరకు టీఎస్ఐఐసీకి 800 ఎకరాలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫార్మాసిటీ పనులు ఆరు నెలలు ఆలస్యంగా సాగుతున్నందున భూ సేకరణ సహా అన్ని అంశాలపై ఈ నెల 31న సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌ను మంత్రి జూపల్లి ఫోన్లో ఆదేశించారు. భూ సేకరణ సమస్యలను అధిగమించేందుకు తహశీల్దార్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.