జన్మభూమి రసాభాస
ఈదులగూడెం (ఆగిరిపల్లి): మండలంలోని ఈదులగూడెం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభ రసాభాసగా మారింది. నూజివీడు టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాట్లాడుతుండగా సర్పంచి భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు ఈలప్రోలు వెంకటసుబ్బయ్య, ఎంపీటీసీ భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు నండూరి భాస్కరప్రసాద్లు గ్రామస్తుల తరఫున పింఛన్ల పంపిణీపై ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గ్రామంలో 23 మంది పింఛన్లు ఎందుకు ఆపేశారో బహిరంగంగా చెప్పాలన్నారు. సెంటు భూమిలేనివారికి ఐదెకరాలున్నట్లు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేత చిట్నేని శివరామకృష్ణ ఉద్రేకంగా మాట్లాడుతూ తాము కమిటీకి సిఫార్సు చేయలేదని, కేవలం రేషన్‌కార్డుల్లో పొరబాట్లవల్ల పింఛన్లు ఆగిపోయాయని తెలిపారు. ఎంపీడీవో కర్రా బసవారావు మాట్లాడుతూ ఆగిన పింఛన్లపై పునఃపరిశీలిస్తున్నట్లు తెలిపారు. జన్మభూమిసభ సక్రమంగా జరగడానికి సహకరించాలని కోరారు.
హామీ ఇవ్వకుంటే ధర్నా: వైఎస్సార్ సీపీ
ఈ సందర్భంగా టీడీపీ, వైఎస్సార్ సీపీ నేత మధ్యనువ్వానేనా అన్నట్లు వాగ్యుద్ధం జరడంతో ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ రెండు వర్గాలను అక్కడినుంచి పంపేశారు. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పింఛన్లు ఆగిపోయినవారికి వచ్చేనెలలో తప్పకుండా ఇస్తామని హామీ ఇవ్వాలని లేకుంటే ఎంపీడీవో కార్యాలయం ముందు బాధితులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం మళ్లీ ముద్దరబోయిన మాట్లాడుతూ జన్మభూమిలో వ్యక్తిగత సమస్యలు మాని గ్రామసమస్యలను ప్రస్తావించాలని చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ రెండుపార్టీల నాయకుల మధ్య ఏమి జరుగుతుందోనని ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఈలోపు ఎంపీడీవో పింఛన్ల పంపిణీకి పిలుపునివ్వడంతో లబ్ధిదారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సర్పంచి ఈలప్రోలు మల్లీశ్వరి, ఎంపీపీ లింగవరపు రామకోటమ్మ, ఎంపీటీసీ నండూరి మంజుల పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సమస్యలపై ఎంపీడీవోకు సర్పంచి వినతిపత్రాన్ని అందజేశారు. తహశీల్దార్ సీహెచ్.ఉమామహేశ్వరరావు, ఎంఈవో ప్రసాద్, ఐసీడీఎస్ సీడీపీవో మంగమ్మ, ఇతరశాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నాయకుల హడావుడి ఉందనటానికి ఈ కార్యక్రమమే ఉదాహరణ.
పింఛన్లు సరే.. రుణమాఫీ ఏదీ
నూజివీడు రూరల్: రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మందాడ నాగేశ్వరరావు ఎంపీపీ టీ శ్రీనివాసరావును ప్రశ్నించారు. మండలంలోని బత్తులవారిగూడెం, అన్నవరం గ్రామాల్లో సోమవారం జన్మభూమి-మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. బత్తులవారిగూడెంలో ఎంపీపీ తొమండ్రు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెబుతుండగా మందాడ నాగేశ్వరరావు అడ్డుపడ్డారు. కొందరు వృద్ధులకు మాత్రమే లబ్ధిచేకూరే పింఛన్ల గురించి కాకుండా రుణమాఫీపై మాట్లాడాలని కోరారు. రైతులు, మహిళలు కోరకపోయినా అలవిగాని హామీలను చంద్రబాబే ఇచ్చారని మందాడ గుర్తుచేశారు. ఆచరణ సాధ్యంగాని హామీలు ఇచ్చి అధికారం దక్కించుకుని ఇప్పుడు 20 శాతం మాఫీ అంటూ పొంతనలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన మాటలు నమ్మి ఓటేసిన రైతులు, మహిళలు ఎదురుచూసి చివరకు బ్యాంకులకు వడ్డీతోపాటు అపరాధరుసుము కూడా చెల్లించాల్సిన దుస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని ఎంపీపీని కోరడంతో ఆ విషయం తమస్థాయిలోది కాదని ఏదైనా చెప్పాలంటే రాతపూర్వకంగా ఇస్తే ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తహశీల్దార్ షేక్ ఇంత్యాజ్పాషా మాట్లాడుతూ రుణమాఫీని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అధికారులుగా తాము కేవలం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే అమలు చేయగలమని చెప్పారు. అధికారులు పలు పథకాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయగా ప్రజలు పట్టించుకోకపోవడంతో గ్రామసభలో భోజన విరామాన్ని ప్రకటించారు. జెడ్పీటీసీ సభ్యుడు బాణావతు రాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
హామీలన్నీ నెరవేరుస్తాం
చాట్రాయి : ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని టీడీనీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని జనార్దనవరంలో జన్మభూమి - మా ఊరు గ్రామ సభ జరిగింది. దీనిలో పాల్గొన్న ముద్దరబోయిన మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనుల్లో సీఎం బిజీగా ఉండడంవల్ల ఇచ్చిన హామీల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. దీనికోసం ప్రతిపక్షాలు ధర్నాలు చేయటం సబబు కాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు మంజూరు కావడంలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీపీ పరసా రమాదేవి, చాట్రాయి జెడ్పీటీసీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, గ్రామసర్పంచ్ పి. దుర్గారావు, ఎంపీటీసీ బాణావతు పుష్పావతి, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ నవీన్, ఏపీవో మున్నీ తదితరులు పాల్గొన్నారు.
ఆరుగొలనుపేటలో
మండలంలోని ఆరుగొలనుపేటలో సోమవారం అధికారులు జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అనంతరం శ్రీ నాగవజ్ర జ్యోత్స్న చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 మంది గర్భిణులకు ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పుచ్చకాయల శ్రీదేవి సీమంతం నిర్వహించారు. చీరలు పంపిణీ చేశారు. గ్రామసర్పంచ్ ఏకశిరి పద్మ, మాజీ సర్పంచ్ ఇజ్జగాని వెంకటేశ్వరరావు, తహశీల్దారు పి తిరుమలరావు, ఈవోపీఆర్డీ ప్రభాకరరావు, ఎంఈవో వి. మారుతీవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమితో సూక్ష్మప్రణాళికలు
ముసునూరు : ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జన్మభూమి ప్రత్యేక అధికారి అజయ్‌కుమార్ నాయక్ అన్నారు. మండలంలోని చిల్లబోయినపల్లిలో సర్పంచ్ బళ్లా శాంతి, జెడ్పీటీసీ చిలుకూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభల ద్వారా గ్రామాల్లో ఏమి అవసరమో గుర్తించి వాటిపై సూక్ష్మప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిద్వారా విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జన్మభూమిలో వచ్చిన అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఐసీడీయస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపీడీవో జి.రాణి, తహశీల్దార్ డి. వనజాక్షి, ఎంపీటీసీ కాండూరు శ్రీరామచంద్ర, ఈవోపీఆర్డీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.