పట్టుపడితే పిల్లలమని చెప్పండి..
కేడర్‌కు నూరిపోస్తున్న లష్కరే తోయిబా
శ్రీనగర్/న్యూఢిల్లీ: భద్రతా దళాలకు పట్టుబడితే మీ వయసు 18 ఏళ్లు లోపేనని చెప్పండి.. కఠిన శిక్షల నుంచి తప్పించుకోండి.. తన కేడర్‌కు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా జారీ చేసిన ఆదేశమిదీ. గత నెలలో దక్షిణ కాశ్మీర్లో భద్రతా దళాలకు పట్టుపడిన మహమ్మద్ నవీద్ జట్ అలియాస్ అబు హంజాలా అనే యువకుడిని విచారించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. పాక్‌లోని ముల్తాన్వాసి అయిన జట్ను భద్రతా దళాలు విచారించినప్పుడు తన వయసు 17 ఏళ్లని చెప్పాడు. నిజానికి అతని వయసు 22 ఏళ్లు. పదేపదే ప్రశ్నించిన మీదట అతను.. లష్కరే ఎత్తుగడను వివరించాడు. 18 ఏళ్లలోపు వయసని చెప్పడం వల్ల భారత్‌లో బాలనేరస్తుల చట్టం కింద విచారిస్తారని, తద్వారా భారత శిక్షాస్మృతి పరిధి నుంచి తప్పించుకోవచ్చని లష్కరే బాస్‌లు నూరిపోసినట్టు తెలిపాడు.
నిధులు సమకూర్చా..: మరోవైపు భారత సంతతి అమెరికన్ గుఫ్రాన్ అహ్మద్ కౌసర్ మహమ్మద్ (31) అల్‌కాయిదా అనుబంధ సంస్థలకు నిధులు సమకూర్చినట్టు శనివారం అమెరికా కోర్టులో అంగీకరించాడు. కౌసర్ కెన్యాకు చెందిన సయ్యిద్తో కలసి సిరియా, సోమాలియాలోని అల్ కాయిదా గ్రూపులకు 25 వేల డాలర్లు సమకూర్చారు.
ఇరాక్ మిలిటెంట్ల చేతికి మరో రెండు పట్టణాలు
బాగ్దాద్: ఇరాక్ సున్నీ మిలిటెంట్లు ఆదివారం బాగ్దాద్‌కు 80 కి.మీ దూరంలోని దులూయా పట్టణంతోపాటు మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవాంట్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీకి పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-ఖిలాఫత్ ఉగ్రవాద మద్దతు ప్రకటించింది. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో శని, ఆదివారాల్లో భద్రతా బలగాలు వివిధ చోట్ల జరిపిన దాడుల్లో 77 మంది మిలిటెంట్లు హత్యమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.