ఇస్లాం మక్కాలో ముహమ్మద్ జననం
అది క్రీస్తు శకం 571. ఒకనాటి రాత్రి
అరేబియా దేశంలోని మక్కానగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నక్షత్రాలు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయి. ఒకవైపు కాబాగృహం. మరోవైపు అబ్దుల్ ముతల్లిబ్ ఇల్లు. రెండుచోట్లా ఒకే రకమైన కాంతిపుంజాల కనకవర్షం ప్రారంభమైంది. కాబానుండి ముతల్లిబ్ గృహం వరకు వజ్రాలు వెదజల్లినట్లుగా మార్గమంతా మెరిసిపోతోంది. సరిగ్గా తెల్లవారుజామున ఈ వెలుగులన్నిటినీ పూర్వపక్షం చేస్తూ, ఆకాశంలో ఓ అద్భుత నక్షత్రం ఉదయించింది. అరేబియా చరిత్రలో అంతకుముందు ఏనాడూ ఇలాంటి అద్భుతం జరగలేదు.
ప్రజలు మరింత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇందులో ఏ విధమైన మర్మం ఉందోనని ఒకవైపున భయపడుతూనే, మరోవైపు ఏదో మహత్తర శుభసందేశమే ఉండి ఉంటుందని అనుకున్నారు. తెల్లవారుతుండగా అబ్దుల్ ముతల్లిబ్ ఇంట కోలాహలం పెరిగిపోయింది. అమ్మలక్కలతో ఆ గృహం వేడుకలా మారిపోయింది. అంతలో ఒక స్త్రీ విప్పారిన మోముతో పరుగు పరుగున వచ్చి అబ్దుల్ ముతల్లిబ్కు మనుమడు కలిగాడని శుభ వార్త అందజేసింది.
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అబ్దుల్ ముతల్లిబ్ మదిలో అంతకు కొద్ది రోజుల ముందు చనిపోయిన కొడుకు అబ్దుల్లా జ్ఞాపకాలు సుడులు తిరిగాయి. కాని మనుమడిని చూస్తూనే ఆయన కళ్లలో కోటికాంతులు విరబూశాయి. మక్కా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అబ్దుల్ ముతల్లిబ్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అటు ఆమినా పరిస్థితి కూడా అలాగే ఉంది. భర్త జ్ఞాపకాలు ఆమె కళ్లను నిండుకుండలు చేశాయి.
సజల నయనాలతోనే ఆమె తోటి మహిళల అభినందనలు స్వీకరిస్తోంది. మక్కాప్రజలంతా అబ్దుల్లా, ఆమినా దంపతులకు కొడుకు పుట్టాడని, సృష్టిలోని అందాన్నంతా కలబోసి చేసిన బంగారు బొమ్మలా, అందమైన మోముతో మెరిసిపోతున్న బాబును గురించి మక్కా పరిసరాల్లో ఒకటే చర్చప్రారంభమైంది. అబ్దుల్ ముతల్లిబ్ ఆ బాలుడికి ముహమ్మద్ అని నామకరణం చేశారు.
ఈ శుభవార్తను ఆనాటి ఓ గొప్ప క్రైస్తవ పండితుడైన అయిస్కు తెలియజేయాలని అబ్దుల్ ముతల్లిబ్ ఆయన వద్దకు వెళ్లారు. క్రైస్తవ పండితుడు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ‘అబ్దుల్ ముతల్లిబ్, నీకు శుభం. పిల్లవాడి పేరేం పెట్టావు?’ అని ఆరా తీశాడు.
‘ముహమ్మద్’ అని నామకరణం చేశాను’ అన్నారు ముతల్లిబ్ విప్పారిన ముఖంతో.
‘ముహమ్మద్’ అంటూ రెండుసార్లు ఉచ్చరిస్తూ, దీర్ఘాలోచనతో ‘ముతల్లిబ్, నేను ఇంతకాలం చెబుతూ వచ్చిన బాలుడు ఇతనే’ అన్నాడు క్రైస్తవ పండితుడు నమ్మకంగా.
‘అవునా?’ అన్నారు అబ్దుల్ ఆశ్చర్యంగా.
‘అవును, నేనింత నమ్మకంగా చెప్పడానికి మూడు కారణాలున్నాయి’
‘మూడుకారణాలా?’ ఏమిటవి?’
‘ఒకటి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాత్రి ఓ అద్భుతమైన నక్షత్రవెలుగు మక్కాపరిసరాలను జాజ్వల్యమానం చేసింది. రెండు: బాబు జన్మించింది సోమవారం రోజు. మూడు: అతని పేరు మహమ్మద్. ఈ మూడు కారణాల వల్ల ఆ బాలుడు సామాన్యమైన బాలుడు కాదని చెప్పగలను’ అన్నాడు పండితుడు.
(డిసెంబర్ 24న ముహమ్మద్ ప్రవక్త జయంతి)
వచ్చేవారం ప్రవక్త జీవితంలోని మరికొన్ని ఘట్టాలు...
- ఎం.డి. ఉస్మాన్ ఖాన్