నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
అనంతపురం పట్టణంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన షేక్ ముజాహీన్ అలీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అన్వర్‌షేక్ బుధవారం పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో కొనుగోళ్ల అనంతరం నకిలీ వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చారు. వాటిని పరిశీలించిన షాపు యజమాని మల్లికార్జున రెడ్డి నకిలీవని గుర్తించి వారిని పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 33 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.