బ్రహ్మోత్సవాలకు టోల్‌ఫ్రీ నెంబర్
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వైశిష్ట్యాన్ని తెలిపేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో ముక్కామల గిరిధర గోపాల్ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా భక్తులు స్వామివారి వైభవాన్ని, బ్రహ్మోత్సవ విశేషాలను తెలుసుకోవచ్చన్నారు. తిరుమలలో సెంట్రలైజేషన్ కంట్రోల్ రూంను కూడా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీని కోరామని.. ఇందుకు సంస్థ యాజమాన్యం, యూనియన్ నాయకులు అంగీకరించారని తెలిపారు.
లడ్డూ ప్రసాదాలు నాలుగైదు రోజులు నిల్వ ఉంచినా రుచిలో మార్పు లేకుండా ఉండే విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నైలో స్వామి ప్రసాదాన్ని పోలిన లడ్డూలను తయారుచేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. స్వామివారి బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విషయంపై ఆర్బీఐ సూచనలు పాటిస్తామని, అదే సమయంలో ఎక్కువ వడ్డీ కోసం ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయబోమని ఈవో స్పష్టంచేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్వామివారి కైంకర్యాలకు, తిరుమల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్నారు. తిరుపతిలో ఉన్న గోసంరక్షణ శాలను పలమనేరుకు మారుస్తామని, అక్కడ 450 ఎకరాల స్థలాన్ని సేకరించామని వెల్లడించారు. మరోవైపు, బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో వైకుంఠ ద్వారంలో ఉన్న లేబొరేటరీలో శ్రీవారి ఆభరణాలకు మెరుగులుదిద్దే పనులు మొదలయ్యాయి.