‘మనగుడి’ విజయవంతం చేయండి
కలెక్టరేట్/వేములవాడ, న్యూస్‌లైన్ : ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహించే ‘మనగుడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈవోలను ఆదేశించారు. ఈనెల 13న వేములవాడ రాజన్న ఆలయంలో లక్షబిల్వార్చన, అన్నపూజ నిర్వహించాలన్నారు.
సాంస్కృతిక పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అధికారి వీరభద్రయ్య మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరపడిన యువకులు తమ గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఈవో సీహెచ్‌వీ. కృష్ణాజిరావు, ఏఈవో హరికిషన్, కొండగట్టు ఈవో నర్సింహులు, ధర్మపురి ఈవో ఆంజనేయులు, అస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు గండ్ర లక్ష్మణ్‌రావు, కార్యదర్శి కె.వి. శర్మ, సభ్యులు శ్రీరామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతికి రాజన్న ఆలయ బృందం..
రాజన్న క్షేత్రంలో అభివృద్ధి పనుల నిర్వహణకు నిధులు మం జూరు చేయాలని టీటీడీని కోరేందుకు ఈ ఆలయ బృందం శుక్రవారం తిరుపతి బయలుదేరి వెళ్లింది. ఆలయ ఈవో కృష్ణాజిరావు నేతృత్వంలో ట్రస్టుబోర్డు సభ్యులు అరుణ్‌తేజాచారి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, చంద్ర మౌళి, మల్లారెడ్డి, ఆకునూరి బాల్‌రాజు, కముటాల శ్రీనివాస్, విజయరాజం, సగ్గుపద్మ వెళ్లిన వారిలో ఉన్నారు. ప్రధానంగా వంద గతుల చౌల్ట్రీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, తాము స్థలం కేటాయిస్తామని ఈవో తెలిపారు.