ఫలితం పొంది విమర్శించడం న్యాయమా?
పట్టిసీమను నిర్మించడంతోనే రాయలసీమకు సాగునీరు
– పండ్ల కొనుగోలులో ‘సూట్’ తీసేసే వారిపై పీడీ కేసులు.. రాష్ట్ర బహిష్కరణ
– 2, 3 నెలల్లో మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా నీరు
– ఈ ఏడాది 6.50లక్షల మంది కౌలు రైతులకు పంటరుణాలు
- అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం చంద్రబాబు
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. రుణమాఫీలో రూ.1.50లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకుని నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది. ఇది న్యాయమా? అని అడుగుతున్నా. ఇలా విమర్శించే వారిని వ్యతిరేకిస్తున్నామని అంతా సంఘీభావం తెలియజేయాలి.’’ ఏ ప్రభుత్వమైనా పనిచేసినప్పుడు ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో రైతు కృతజ్ఞతయాత్ర పేరుతో చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆపై బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘పాదయాత్రను హిందూపురం నుంచే ప్రారంభించా. రైతుల కష్టాలు చూసి రుణమాఫీ చేయాలని నిర్ణయించా. దానికి కట్టుబడి మాఫీ చేశా. రాష్ట్రంలో రూ.24,500కోట్లను మాఫీ చేశా.
అందులో రూ.2,728కోట్లు అనంతపురానికి వచ్చింది. నేను ఒక ఉద్యానవన తోటగా రాయలసీమను చేస్తా. దేశమే కాదు.. ప్రపంచం మొత్తం అనంతపురం పండ్లు, కూరగాయలు తినేరోజు వస్తుంది. రాయదుర్గంలో ఇప్పటికే ఎడారి ఛాయలు కన్పిస్తున్నాయి. అందుకే హంద్రీనీవా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నా. మరో 2, 3 నెలల్లో హిందూపురం నుంచి మడకశిరకు నీళ్లు తీసుకెళతాం.
రేయిన్గన్లతో పంటలను కాపాడేందుకు యత్నించా!
రాష్ట్రానికి ఇన్పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214కోట్లు ఇస్తే రూ.1451కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. ఈ ఏడాది రాష్ట్రంలో 6.50లక్షల మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పండ్ల ఉత్పత్తులు రైతులు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా. అలాగే ఇన్పుట్ సబ్సిడీని అనర్హులు తీసుకునేందుకు వీళ్లేదు. అర్హులైన వారే తీసుకోవాలి.
తాడిపత్రి ఉదంతంలో అనాథగా మారిన ప్రసన్నకు సీఎం అండ:
తాడిపత్రిలో మంగళవారం తెల్లవారుజామున రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తన భార్య సులోచనమ్మ, ఇద్దరు పిల్లలు ప్రత్యూష, సాయి ప్రతిభను సుత్తితో కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత బుధవారం రామసుబ్బారెడ్డి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయితే పెద్దకుమారై ప్రసన్న తిరుపతిలో ఉండటంతో బతికిపోయింది. ఈ క్రమంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. ఈ ఉదంతాన్ని సీఎం వివరించారు.
ఆపై ప్రసన్న మాట్లాడుతూ ‘మా నాన్న మా అమ్మను, చెల్లెళ్లను దారుణంగా చంపేశారు. మా నాన్న అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉంది. కుటుంబంలో అందరూ చనిపోయి అనాథగా మారడంతో నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు చేయాలని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు ఆ లక్ష్యం కోసమే నేను బతుకుతా. అది సాధిస్తా.’ అన్నారు. ప్రసన్న పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్న బాగోగులను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.