multi-brand retail
-
హైదరాబాద్‌లో తొలి మల్టీ బ్రాండ్ ఈవీ స్టోర్.. ఇక అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే చోట!
ప్రముఖ మల్టీ బ్రాండ్ ఈవీ స్టోర్ కంపెనీ బీలైవ్ తన రెండో మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో, సంస్థ దక్షిణ భారతదేశంలో తన తొలి మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మల్టీ బ్రాండ్ ఈవీ కేంద్రంలో వినియోగదారులకు 20కి పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి. మల్టీబ్రాండ్ ఈవీ కేంద్రంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లను విక్రయించనున్నారు. ఈ మల్టీబ్రాండ్ ఈవీ కేంద్రంలో కైనెటిక్ గ్రీన్, టెకో ఎలెక్ట్రా, జెమోపై, బాట్:ఆర్ఈ, డెటెల్ వంటి బ్రాండ్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడంతో పాటు ఈ స్టోరు ఛార్జింగ్ సొల్యూషన్స్, పోస్ట్ సేల్స్ సర్వీస్ ప్యాకేజీలను కూడా అందిస్తుంది. ఈ స్టోర్ ప్రారంభం గురించి బిలైవ్ సహ వ్యవస్థాపకుడు సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 2024 నాటికి 5 బిలియన్ పెరగనున్నట్లు అంచనా వేశారు. "ఈవీలను కొనుగోలు చేయడానికి, ఉపయోగించడానికి కస్టమర్లకు ఒక ఫ్లాట్ ఫారాన్ని అందించడమే బిలైవ్ విజన్. మరింత మంది వినియోగదారులు, వ్యాపారులు తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి కోరుకోవడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది" అని ఆయన తెలిపారు. బిలైవ్ ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ త్వరలో దేశవ్యాప్తంగా 100కి పైగా ప్రదేశాలలో ఓపెన్ చేయనున్నట్లు ఖోల్కర్ తెలిపారు. (చదవండి: ఎయిర్ ఇండియాకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?) -
చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
న్యూఢిల్లీ: చట్ట స్ఫూర్తిని ఉల్లంఘించొద్దని పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హితవు పలికారు. రౌండ్ ట్రిప్పింగ్ (ఒకరి నుంచి ఒకరు చేతులు మార్చుకోవడాన్ని) వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ‘‘ఏ తప్పూ చేయని వారికి ఎటువంటి సమస్య ఉండదని నేను భరోసా ఇస్తున్నాను. కానీ, అదే సమయంలో తప్పుడు పనుల్లో పాల్గొనే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశ సంస్కృతి, మైండ్‌సెట్‌ను మార్చేస్తాం’’ అని పీయూష్ గోయల్ సీఐఐ సభ్యులతో సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయవాదులు, అంతర్జాతీయంగా నాలుగు అతిపెద్ద ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థలు (పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈఅండ్‌వై) ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. భారత చట్ట స్ఫూర్తికి విరుద్ధమైన సలహాలు ఇవ్వొద్దని పరోక్షంగా హెచ్చరించారు. బహుళ బ్రాండ్ల ఉత్పత్తుల రిటైల్ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) చట్టాన్ని కంపెనీలు గౌరవించాలని, లొసుగుల ద్వారా దీన్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. చట్టానికి అనుగుణంగా... ‘‘మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించే విధానం అమల్లో ఉంది. దీనికి కట్టుబడి ఉన్నాం. ప్రతీ ఒక్కరూ దీన్ని అనుసరించాలి, గౌరవించాలి. చట్టానికి అనుగుణంగా ఉన్నంత వరకు సమస్య ఏమీ ఉండదు’’ అని మంత్రి పేర్కొన్నారు. చట్టానికి అనుగుణంగా నడచుకోండి. రౌండ్ ట్రిప్పింగ్‌ను చట్టం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మీలో ఎవరైనా అది చేసుంటే అంగీకరించి ప్రక్షాళన చేసుకుని, ఆ అధ్యాయానికి ముగింపు పలకండి’’ అని మంత్రి సూచించారు. దొడ్డిదారిన వచ్చిన వారు బయటపడే మార్గం కోసం కామా, పుల్‌స్టాప్‌లను వెతకొద్దన్నారు. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై గోయల్ స్పందిస్తూ... చట్టంలో కొన్ని నిబంధనలు భారంగా ఉన్నాయని, వాటిని సభ్యదేశాల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎగుమతిదారులకు విదేశీ మారక రుణాలు ఎగుమతిదారులకు విదేశీ మారక రూపంలో రుణాలను సమకూర్చే విషయంలో బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖజానాపై పెద్దగా భారం పడకుండా, ఖరీదైన రుణ సమస్యను పరిష్కరించే మార్గాలున్నాయని చెప్పారు. వాణిజ్యానికి సంబంధించి ఏ అంశానికైనా సబ్సిడీలన్నవి పరిష్కారం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా విదేశీ కరెన్సీ రుణాలు సమకూర్చనున్నామని, బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ విషయం లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రాల పన్నులను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 50 బిలియన్ డాలర్ల ఎగుమతులకు అవకాశాలున్నాయని వాణిజ్య శాఖ మదింపు వేసినట్టు చెప్పారు. -
రిటైల్ ఎఫ్‌డీఐలపై కేంద్రంతో రాష్ట్రాల భేటీ
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడంపై రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం సమావేశం నిర్వహించింది. రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐల విషయంలో ఇటు చిన్న రిటైలర్లు, అటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం అన్నది దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రానికి రాష్ట్రాలు సూచించాయి. ఏది ఏమైనప్పటికీ దీనిపై రాష్ట్రాల స్థాయిలో సంబంధిత వర్గాలతో కూలంకుషంగా చర్చించిన తర్వాతే అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు హర్యానా ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు తెలిపారు. అన్ని రాష్ట్రాలు 15 రోజుల్లోగా మల్టీబ్రాండ్ రిటైల్, ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐలపై తమ అభిప్రాయాలను కేంద్రానికి తెలపాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు హాజరు కాలేదు. -
ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో సొంతంగా కార్యకలాపాల విస్తరణకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంపై దృష్టిసారించిన ఈ సంస్థ... వచ్చే 4-5 ఏళ్లలో 50 వరకూ ఈ తరహా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారతీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్.. బెస్ట్‌ప్రైస్ మోడల్ హోల్‌సేల్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితం భారతీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాల కోసం ముడుపులు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ వ్యాపార విధానాల నిబద్ధతను మరింత పటిష్టం చేయనున్నట్లు కూడా పేర్కొంది. ఆరేళ్లపాటు భారతీతో కలిసి దాదాపు 20 స్టోర్లను నిర్వహించిన వాల్‌మార్ట్... ఆ సంస్థతో విడిపోయాక ప్రకటించిన కీలక వ్యాపార వృద్ధి ప్రణాళికలు ఇవే కావడం గమనార్హం. మల్టీబ్రాండ్ రిటైల్ ప్రణాళికలపై మౌనం... ‘భారత్‌లో పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వ్యాపార వృద్ధి ప్రణాళికల విషయంలోనూ చాలా ఉత్సుకతతో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో మా ప్రస్థానం కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ రిటైల్ రంగంలో వచ్చిన మార్పుల పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విభాగంలో మరింత భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అందుకే రానున్న 4-5 ఏళ్లలో కొత్తగా 50 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. మా కస్టమర్లకు మరింత చేరువయ్యేలా... వర్చువల్ షాపింగ్ అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరించనున్నాం’ అని వాల్‌మార్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ స్కాట్ ప్రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరఫరా మౌలికవసతులు, సరఫరాదారుల అభివృద్ధికి సంబంధించి కూడా పెట్టుబడులపైనా కంపెనీ దృష్టిసారిస్తోంది. అయితే, భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ విభాగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై వివరాలను మాత్రం వాల్‌మార్ట్ వెల్లడించలేదు. -
పెట్టుబడుల గమ్యాల్లో మనమే టాప్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఈ విషయంలో పొరుగునున్న చైనా, సూపర్‌పవర్ అమెరికాలను కూడా వెనక్కినెట్టింది. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈఅండ్‌వై) నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కాగా, భారత్ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా వరుసగా రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇక టాప్-10 జాబితాలో కెనడా(4), అమెరికా(5), దక్షిణాఫ్రికా(6), వియత్నాం(7), మయాన్మార్(8), మెక్సికో(9), ఇండోనేసియా(10) స్థానాల్లో నిలిచాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఇటీవల కాలంలో భారీగా సడలించడం, మల్టీబ్రాండ్ రిటైల్ సహా పలు రంగాలకు గేట్లు తెరవడంతో ఇన్వెస్టర్లలో భారత్ పట్ల విశ్వాసం పుంజుకోవడమే ఆకర్షణీయమైన గమ్యంగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. డాలరుతో రూపాయి మారకం విలువ భారీ క్షీణత కూడా ఒక కారణంగా నిలిచింది. ముఖ్యాంశాలివీ... ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు నిరాశాజకనంగా ఉండటం, రుణ భారం అంతకంతకూ ఎగబాకడం వంటి ప్రతికూలతలతో అనేక భారతీయ కంపెనీలు తమ ప్రాధాన్యేతర(నాన్-కోర్) వ్యాపారాల్లో వాటా విక్రయాలపై దృష్టి సారిస్తున్నాయని ఈఅండ్‌వై నివేదిక (పెట్టుబడుల విశ్వాస సూచీ) పేర్కొంది. విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో మరిన్ని అవకాశాలను దక్కించుకోవడానికి ఇది ఆస్కారం కల్పిస్తోందని తెలిపింది. ఇక భారత్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తిచూపుతున్న ఇన్వెస్టర్లలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌లు టాప్-3 స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్, టెక్నాలజీ, లైఫ్‌సెన్సైస్, కన్సూమర్ ఉత్పత్తుల రంగాలో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 70 దేశాల్లోని బడా కార్పొరేట్ కంపెనీలకు చెందిన 1,600 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా నివేదికను ఈఅండ్‌వై రూపొందించింది. వచ్చే 12 నెలల్లో విలీనాలు,కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) ఒప్పందాల సంఖ్య పుంజుకోవచ్చని 38 శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కంపెనీల కొనుగోళ్లకు భారత కార్పొరేట్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌పై ఇన్వెస్టర్ల ధోరణి సానుకూలంగానే ఉందని ఈఅండ్‌వై నేషనల్ లీడర్, పార్ట్నర్ అమిత్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.