బహు పాత్రాభినయం !
చిత్తూరు నగరపాలక సంస్థలో అందరికీ ఇన్‌చార్జ్‌ల బాధ్యత
భర్తీకాని కొత్త పోస్టులు పదోన్నతుల కోసం పడిగాపులు
చిత్తూరు (అర్బన్): జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని సిబ్బంది వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ బహు పాత్రాభినయం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల్ని ఎవరూ భర్తీ చేయమని అడగడంలేదు. ఇక మాకు అన్నీ అర్హతలు ఉన్నాయి.. పదోన్నతులు ఇవ్వం డయ్యా అని అడిగినా వినిపించుకోవడంలేదు. చేసేదేమీలేక ఉన్న సిబ్బందే పలు సీట్లకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఊడి గం చేస్తున్నారు.
కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ తరువాత పరిపాలన మొత్తం సహాయ కమిషనర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏడాదికి పైగా సహాయ కమిషనరు పోస్టు ఖాళీగా ఉంది. కార్యాలయంలో మేనేజరుగా పనిచేస్తున్న అధికారే సహాయ కమిషనరుగా, సీ-1 గుమాస్తా, రెవెన్యూ అధికారి పనిని చక్కబెడుతూ బహుపాత్రల్ని పోషిస్తున్నారు.
{పజారోగ్య శాఖ విభాగంలో బహు పాత్రాభినయం చేసే వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కార్పొరేషన్‌కు ఐదే శానిటరీ ఇన్స్పెక్టర్ల పోస్టులు మంజూరయినా ఇక్కడ ఉన్నది మాత్రం ఒక్కరే. దీంతో నలుగురు మేస్త్రీలకు అదనంగా శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వడం తో అందరూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే కార్మికుల జీత భత్యా లు, డీఅండ్‌వో ట్రేడ్ లెసైన్సులు చూసే ఎఫ్-1, ఎఫ్-2 విధులను ఒక్కరే నిర్వర్తిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
రెవెన్యూ విభాగంలో ఐదు యూడీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పోస్టులు ప్రభుత్వం నుంచి మంజూరైనా భర్తీకి మాత్రం నోచుకోలేదు. ఫలితంగా ఇద్దరు ఆర్ఐలు నాలుగు పోస్టుల్ని పంచుకున్నారు. వాణిజ్య భవనాల నుంచి అద్దెలు వసూలు చేయాల్సిన ఏ-1 పోస్టు చూసే వ్యక్తే మీటింగ్ గుమాస్తా పని సైతం చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ పనులు చూసే అసిస్టెంట్ ఇంజనీరు ఎలక్ట్రికల్ బాధ్యతను మోస్తున్నారు.
ఇక పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కూడా నత్తనడకన సాగుతోంది. అర్హత ఉన్న వారిని పదోన్నతులు ఇవ్వకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. కమిషనరు క్యాంప్ క్లర్క్‌గా ఉన్న వ్యక్తే పట్టణ ప్రణాళిక విభాగంలో జీ-2 గుమాస్తా పనిచేస్తూ ద్విపాత్రభియనం చేస్తున్నారు. ఇలా కార్పొరేషన్ కార్యాలయంలో చాలా మంది అధికారులు, సిబ్బంది అదనపు బాధ్యతల్ని నిర్వర్తిసున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
కార్పొరేషన్‌కు కొన్ని పోస్టులు మంజూరయ్యాయి. మరికొన్ని పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. నియామకాలు జరగకపోవడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయమని రాష్ట్ర పురపాలక పరిపాలన సంచాలకుల ద్వారా ప్రభుత్వాన్ని అడిగాం. అక్కడి నుంచి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇక అర్హత ఉన్న ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు ఇచ్చేస్తాం.
- జి.శ్రీనివాసరావు, కమిషనరు, చిత్తూరు కార్పొరేషన్