మూసీ నీటితో మల్టీవిటమిన్ టానిక్ లు
♦ నకిలీ మందుల తయారీ గుట్టురట్టు
♦ రూ. 30 లక్షల సరుకు స్వాధీనం
♦ రెండు కంపెనీలు సీజ్ చేసిన ఎస్వోటీ పోలీసులు
ఉప్పల్ : చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే మల్టీ విటమిన్స్ టానిక్‌లు, న్యూట్రిషన్స్, గ్లూకోజ్‌లను బ్రాండెడ్ల కంపెనీల పేరుతో సరిపోలేలా కొద్దిపాటి మార్పులతో ప్యాకింగ్ చేసి నకిలీ మందులను, పోషకపదార్ధాల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించి రూ.30 లక్షల విలువైన నకిలీ మందులు, టానిక్లను స్వాదీనం చేసుకున్నారు.
ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన జిల్లా శ్రీరాములు, గంగాధర్‌రెడ్డి పదేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి రామంతాపూర్‌లో స్థిరపడ్డారు. టీవీ కాలనీలోని మూసీ నాలా సమీపంలో రెండు ఇళ్లను అద్దెకు తీసుకొని మెడికెమ్ ల్యాబ్స్, శ్రీసాయి వర్ష న్యూట్రిషన్ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారు. బీ ఫార్మసీ పట్టభద్రుడైన శ్రీరాములు ప్రముఖ న్యూట్రిషన్ కంపెనీల పేర్లను ఒక్క అక్షరం తేడాతో లేబుల్‌లను తయారుచేస్తూ దాదాపు 30 రకాల మల్టీ విటమిన్ టానిక్‌లు, ఎనిమిది రకాల మాత్రలను మార్కెట్‌కు సరఫరా చేసేవాడు. వీరి కంపెనీలకు సం బందించి 2006 నుండి లెసైన్స్ రెన్యువల్ చేయకపోగా, గడువు తీరిన మందులపై కొత్త తేదీలను ముద్రించి విక్రయించేవారు. వీటిని ఎక్కువ కమీషన్ ఆశ చూపి ఏజెన్సీల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సహా పొరుగు రాష్ట్రాల్లో విక్రయించేవారు. వీరికి హిమాయత్‌నగర్‌లోని వెంకటనారాయణ ప్రింటింగ్ ప్రెస్‌లో మందులకు అవసరమయ్యే ప్యాకింగ్‌లు, లేబుల్లు తయారు చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మూసీ నీటితోనే మందుల తయారీ
నిందితులు తయారుచేసే నకిలీ సిరప్, టానిక్‌లకు మూసీ సమీపంలో వేసిన బోరు నీటినే వాడుకుంటుం డటం గమనార్హం. దాడుల్లో మల్కాజిగిరి ఎస్వోటీ ఎస్సై రాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.