ముంబైలోనూ నీటి కష్టాలు.. నీటి సరఫరా 15 శాతం కట్?
దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా నీటి సరఫరాను ఐదు శాతంమ మేరకు తగ్గించింది. ఈరోజు (మార్చి 19) ముంబైలో నీటి కోత 15 శాతం మేరకు ఉంటుందని ప్రకటించింది. దీంతో ముంబైవాసులలో ఆందోళన పెరిగింది.
నిర్వహణ పనుల కారణంగా నీటి సరఫరాను తగ్గించినట్లు బీఎంసీ పేర్కొంది. పౌర సంఘం తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని పైస్ డ్యామ్‌లో నీటి కొరత కారణంగా నగరం అంతటా అదనపు నీటి కోత విధించారు. తాజాగా బీఎంసీ ఒక ప్రకటనలో మహానగరానికి 60 కి.మీ దూరంలో ఉన్న డ్యామ్‌కు భట్సా రిజర్వాయర్ నుండి నీరు వచ్చిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది.
ఇదిలావుండగా ఆసియాలోని అతిపెద్ద ప్లాంట్లలో ఒకటైన భాండూప్‌లోని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌లో క్లీనింగ్ కారణంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ముంబైలో ఐదు శాతం నీటి కోతను బీఎంసీ ప్రకటించింది. డ్యామ్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గతంలో పది శాతం నీటిని తగ్గించాలని ప్రతిపాదించింది. కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే బెంగళూరులో 14 వేల బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో పాటు చెరువులన్నీ కూడా దాదాపు అడుగంటిపోయాయి.