నాందేడ్వాసుల రైల్‌రోకో
నాందేడ్, న్యూస్‌లైన్: ముంబై-లాతూర్ ఎక్స్‌ప్రెస్‌ను నాందేడ్ వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం స్థానికులు రైల్‌రోకో నిర్వహించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలటకు అంతరాయం ఏర్పడింది. ఉదయం తొమ్మిది గంటలకు నాందేడ్ చేరుకున్న ముంబై-సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 11 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో ముంబై నుంచి శనివారం రాత్రి ఆ రైలులో స్వగ్రామాలకు బయలుదేరిన తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబై-లాతూర్ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో నాందేడ్ వరకు పొడిగిస్తామని అప్పట్లో రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఇంతవరకు దాన్ని పొడిగించలేదు. ఇదే అంశంపై గతంలో పలుమార్లు ర్యాలీలు, ఆందోళనలు కూడా జరిగాయి.
మరోవైపు ఈ రైలును నాందేడ్ వరకు పొడిగించవద్దని లాతూర్వాసులు కూడా భారీగా ఆందోళనలు చేశారు. దీంతో రైల్వే పరిపాలన విభాగం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఆగ్రహానికి గురైన నాందేడ్వాసులు రైలురోకోకు దిగారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రజలు పోలీసుల కళ్లుగప్పి మెల్లమెల్లగా నాందేడ్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే సంఘర్ష్ సమితి నాయకుడు సుధాకర్‌రావ్ డోయిఫొడే నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో స్థానికులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పోలీ సులు కలుగజేసుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం 11.10 గంటలకు నాందేడ్ నుంచి పంపించారు. ఈ ఆందోళనలో ఎంపీ భాస్కర్‌రావ్ పాటిల్, శివసేన పార్టీ ప్రజా సంబంధాల అధికారి ప్రకాశ్ మారావార్, జిల్లా పరిషద్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్, వివిధ పార్టీల పదాధికారులు, స్థానికులు పాల్గొన్నారు.