గ్రౌండ్స్‌మెన్‌గా మారిన ముంబై ఆటగాళ్లు
న్యూఢిల్లీ: మైదానంలో పరుగుల వరద పారించడమే కాకుండా అవసరమైతే అదే మైదానాన్ని శుభ్రపరిచేందుకు కూడా వెనుకాడమని ముంబై రంజీ ఆటగాళ్లు నిరూపించారు. రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా రెండో రోజు ఆట కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ముంబై ఆటగాళ్లు కర్నైల్ సింగ్ గ్రౌండ్‌కు వచ్చారు. తొలి రోజు ఆదివారం వర్షం కారణంగా కేవలం 8.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సోమవారం కూడా అక్కడ చాలా భాగం నీటితో నిండడం గమనించారు. దీనికి తోడు నీటిని తోడేసే సూపర్‌సాపర్ పనిచేయడం లేదు.
నలుగురు గ్రౌండ్స్‌మెన్ మాత్రమే పనిచేసేందుకు ఉన్నారు. ఎలాగైనా మ్యాచ్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో ఇక ఆటగాళ్లే రంగంలోకి దిగారు. ఎస్కే యాదవ్, అభిషేక్ నాయర్ మరో ఏడుగురు ఆటగాళ్లు షూస్ లేకుండా ఓ చేతిలో స్పాంజి, మరో చేతిలో బకెట్‌తో నీటిని తోడడం ప్రారంభించారు. 35 నిమిషాల సేపు అలుపెరగకుండా మైదానాన్ని తడి లేకుండా చేసేందుకు వీరంతా కష్టపడ్డారు.
మీడియా ఫొటోలు తీస్తుండడంతో... రైల్వేస్ క్యురేటర్ సంజీవ్ అగర్వాల్ ముంబై కోచ్ ప్రవీణ్ ఆమ్రే వద్దకు వెళ్లారు. స్టాఫ్‌ను పెంచుతామని, ఆటగాళ్లను వెనక్కి రప్పించాల్సిందిగా కోరారు. అయితే తమ ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేశారని, ఇక్కడ సదుపాయాలు మెరుగ్గా లేవని ఆమ్రే అన్నారు. మరోవైపు గత రెండేళ్లుగా ఇక్కడ మ్యాచ్‌లు జరుగలేవని, అందుకే సూపర్‌సాపర్ అవసరం తమకు రాలేదని ఆర్ఎస్పీబీ చీఫ్ రేఖా యాదవ్ అన్నారు.