ట్రాఫిక్ కష్టాలకు...‘క్యూ’ చెక్
ముంబై విధానాన్ని అధ్యయనం చేస్తున్న రాష్ట్ర బృందం
సాక్షి,హెదరాబాద్: ముంబై రవాణా వ్యవస్థలో అమలవుతున్న ‘క్యూ’ పద్ధతిని అధ్యయ నం చేసేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నేతృత్వంలో వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల బృందం గురువారం ముంబై వెళ్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేయాలన్న యోచనలో ఉన్న నేపథ్యంలో ఈ బృందం ముంబైకి వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలిస్తోంది.
బృంద సభ్యు లు అక్కడి రవాణా సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను పరిశీలించినట్లు బృందంలో ఉన్న రాష్ట్ర రవాణా సంయుక్త కమిషనర్ రఘునాథ్ ‘సాక్షి’కి ఫోన్‌ద్వారా వెల్లడించారు. బృందం పరిశీలన జరిపిన సమాచారం మేరకు ముంబైలో 36 బస్‌డిపోలు ఉన్నా యి. 4,200 బస్సులు కలిగిన బృహన్ ఎలక్ట్రికల్ సర్వీస్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ప్రతీ రోజు సుమారు 45 లక్షల మంది ప్రయాణికుల కు రవాణా కల్పిస్తోంది.
ఆగార్కర్ బస్టాపులో ప్రయాణికులు ‘క్యూ’ పద్ధతిలో బస్సు ఎక్కడం, దిగడం, అక్కడి నుంచి లోకల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు స్కైవాక్ సదుపాయాన్ని వినియోగించుకోవడం వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం మంత్రులు, అధికారుల బృందం వడాల బస్‌డిపోకు వెళ్లారు. అక్కడ ‘బెస్ట్’ ఉన్నతాధికారులు బస్సుల నిర్వహణపై వివరించా రు. హాంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సారథ్యంలోని ఈ బృందంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా,జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రవాణా కమిషనర్ జగదీశ్వర్, ఆర్టీసీ జేఎమ్డీ రమణ్‌రావు, అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, మహంతిలు పర్యటనలో ఉన్నారు.
తెలంగాణ అంతటా అమలు చేయవచ్చు: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్
ముంబయిలో సమీకృత ప్రజా రవాణా వ్యవస్థ అమలు తీరు చాలా బాగుంది. ప్రయాణికులు లోకల్ ట్రైన్ దిగి బస్సులో వెళ్లొచ్చు.లేదంటే మరో రకమైన రవాణా సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు.ఈ లింకు సదుపాయం ఎంతో ఉపయోగం. బస్షెల్టర్లు, బస్టాపులు అనుకూలం గా ఉన్నాయి. స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఇలాంటి రవాణా సదుపాయాలను ఒక్క హైదరాబాద్‌లోనే కాాకుండా తెలంగాణ రాష్ట్రమంతటా అమలు చేయవచ్చు.
ముంబై రవాణాలోని ప్రత్యేకతలివీ...
ప్రతీ బస్‌షెల్టర్ బస్సులు ఆగేందుకు వీలుగా ఉంటుం ది. అవి ఒకదాని తరువాత ఒకటి వచ్చి, ఆగి వెళ్తాయి.
ప్రయాణికులు క్యూ పద్ధతిలో వెనుక ద్వారం నుంచి ఎక్కి, ముందు నుంచి దిగుతారు.
అన్ని బస్సుల్లోనూ జీపీఎస్ ఉంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా బస్సు కదలికలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి.
బస్సుల్లో అనౌన్స్మెంట్ పద్ధతి ఉంది. రెండు స్టేజీలు ముందుగానే అనౌన్స్ చేస్తారు.
స్మార్ట్‌కార్డు తరహాలో అక్కడ బస్‌పాస్‌లను అమలు చేస్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే కండక్టర్ వద్ద ఉండే టికెట్ ఇష్యూ మిషన్‌లో కార్డు స్వైప్ చేస్తారు.
టికెట్లు కూడా ఈ ‘టిమ్స్’ యంత్రాలతో ఇస్తున్నారు.