65 క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కృతి
ఇస్లామాబాద్: 65 మంది మరణ శిక్ష పడ్డ ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లను, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ తిరస్కరించారు. వీరిలో హత్య కేసులో దోషిగా ఉన్న కనీజాన్ బీబీ అనే ఒకే ఒక్క మహిళ కూడా ఉంది. కనీజాన్కు ఉరి అమలైతే, పాక్లో ఇప్పటివరకు ఉరి శిక్ష పడ్డ మహిళల సంఖ్య 9కి చేరుతుంది. అధికారిక లెక్కల ప్రకారం పాక్లో కింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులతో కలుపుకొని మొత్తం 47 మంది ఉరిశిక్ష పడ్డ మహిళల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో 150 మంది ఖైదీలకు ఉరి శిక్షని అమలు చేశారు. గత సంవత్సరం జరిగిన పెషావర్ ఆర్మీ స్కూల్ విషాదం తర్వాత మరణ శిక్ష నిషేధాన్ని టెర్రరిజం సంబంధం ఉన్నకేసుల్లో ఎత్తి వేశారు. ఈసంఘటనలో 140 విద్యార్థులు, సిబ్బంది చనిపోయారు. క్షమాభిక్ష తిరస్కరించిన వారందరికి రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఉరి శిక్ష అమలు కానుంది.