ఇక మున్సిపల్ బాండ్ల లిస్టింగ్
స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్
‘ముని బాండ్ల’పై సెబీ ముసాయిదా నిబంధనలు
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పొదుపు మొత్తాలు ఉపకరించేలా చూసే దిశగా.. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్తగా మున్సిపల్ బాండ్ల లిస్టింగ్, ట్రేడింగ్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను మంగళవారం వెల్లడించింది. వీటి ప్రకారం ‘ముని బాండ్స్’ (మునిసిపల్ బాండ్లు) జారీ చేసే సంస్థలు ఆర్థికంగా పటిష్టమైన ట్రాక్ రికార్డు కలిగి ఉండాలి.
బాండ్ల వ్యవధి కనీసం మూడేళ్లు ఉండాలి. అలాగే, ఆయా సంస్థలు.. తాము దేని కోసం నిధులు సమీకరిస్తున్నాయో ఆ ప్రాజెక్టు వ్యయంలో కనీసం 20 శాతమైనా సొంతంగా పెట్టాల్సి ఉంటుంది. రిస్కు ఎక్కువగా ఇష్టపడని దేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్రధానంగా ఫిక్సిడ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు లేదా బంగారంలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ముని బాండ్స్ ఉపయోగపడగలవని సెబీ పేర్కొంది. వీటిపై సంబంధిత వర్గాలు జనవరి 30 లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని వివరించింది.
పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా 8 శాతం దాకా వడ్డీ రేటు ఇచ్చే బాండ్లను మాత్రమే పన్ను ప్రయోజనాలిచ్చే బాండ్లుగా ప్రకటించే వీలుంది. అయితే, 8 శాతం మాత్రమే స్థిర వడ్డీ రేటును ప్రతిపాదిస్తే బాండ్లపై ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి కనపర్చకపోవచ్చని సెబీలో భాగమైన కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటైజేషన్ అడ్వైజరీ కమిటీ అభిప్రాయపడింది. దీన్ని బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుసంధానించి చలన వడ్డీ రేటు ఉండేలా చూస్తే ప్రయోజనం ఉండగలదని భావిస్తోంది.
ఇప్పుడు కూడా వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్లు జారీ చేస్తున్నప్పటికీ.. ఈ మార్గంలో సమీకరించిన మొత్తాలు కేవలం రూ. 1,353 కోట్లు మాత్రమే. 1997లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా రూ. 125 కోట్ల విలువ చేసే బాండ్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో జారీ చేసింది. ఆ తర్వాత 1998లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రూ. 100 కోట్లు సమీకరించింది.
హైదరాబాద్,వైజాగ్ సహా నాసిక్, చెన్నై, నాగ్పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇలాంటి బాండ్లను జారీ చేశాయి. అయితే, ముని బాండ్లను స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేసేందుకు గానీ ట్రేడింగ్ చేసేందుకు గానీ ఇప్పటిదాకా అనుమతి లేదు. సాధారణంగా అమెరికా సహా సంపన్న దేశాల్లో మున్సిపల్ బాండ్లు బాగా ప్రాచుర్యంలోనే ఉన్నాయి.