రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
యాలాల, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని అగ్గనూరు వీఆర్వో మునియప్ప దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని రసూల్పూర్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండ లం మంతన్‌గౌడ్ గ్రామానికి చెందిన మునియప్ప(45) మండల పరిధిలోని అగ్గనూరు గ్రామ క్లస్టర్ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తోటి ఉద్యోగులతో కలిసి తాండూరుకు వచ్చా రు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆయన తన బైకుపై స్వగ్రామానికి వెళ్తుండగా రసూల్పూర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో యాలాల నుంచి తాండూరుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం గమనించి కుటుంబీకులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులు, యాలాల రెవెన్యూ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య అంబమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.
శనివారం సస్పెన్షన్ వేటు..
బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ గ్రామ వీఆర్ఏ(కావలికారు)గా విధులు నిర్వహిస్తున్న మునియప్ప రెండేళ్ల క్రితం పదోన్నతిపై అగ్గనూరు వీఆర్వో బాధ్యతలు స్వీకరించారు. మునియప్ప అందరితో కలివిడిగా ఉండేవారని బంధువులు, గ్రామస్తులు, నాయకులు తెలిపారు.
కాగా శనివారం ఇసుక మేటలను పరిశీలించడానికి వచ్చిన వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియలో వెనుకబడ్డారనే కారణంతో మునియప్పతో పాటు మరో వీఆర్వో వెంకటయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయమై ఆదివారం ఉదయం నుంచి తన తోటి ఉద్యోగులు, మిత్రుల వద్ద చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఉండొచ్చని తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు.