Munja palm
-
కడుపు నిండుతుంది బరువు తగ్గుతుంది
ముంజలు తినడానికే కాదు... ఒకింత పారదర్శకంగా, చేతుల్లోంచి జారిపోతూ చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ముంజలను ఇంగ్లిష్‌లో ‘ఐస్ ఆపిల్’ అంటారు. ముంజలు తినడం వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల జాబితాకు అంతే లేదు. వాటిలో కొన్ని. ముంజల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల తినగానే కడుపు నిండిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకున్నవారికి ముంజలు ఒక రుచికరమైన మంచి మార్గం. ముంజలు వికారాన్ని సమర్థంగా నివారిస్తాయి. ముంజలు మలబద్దకాన్ని నివారించి, సుఖవిరేచనమయ్యేలా చూస్తాయి. ఇలా ఇవి అందరిలోనూ మలబద్దకాన్ని నివారించి, దానివల్ల వచ్చే ఎన్నో అనర్థాలు రాకుండా చూస్తాయి. అయితే గర్భవతుల్లో మలబద్దకం చాలా సాధారణం కాబట్టి ముంజలు తినడం వల్ల వారికి మంచి ప్రయోజనం ఉంది. వడదెబ్బ నుంచి రక్షించే రుచికరమైన మంచి మార్గం ముంజలే. వాటిల్లో స్వాభావికంగా ఎక్కువగా ఉండే నీటిపాళ్లు, పుష్కలంగా ఉండే ఖనిజలవణాలు.. వ్యక్తులను ఎండదెబ్బ వల్ల కలిగే డీ–హైడ్రేషన్నుంచి రక్షిస్తాయి. చికెన్‌పాక్స్‌తో బాధపడేవారికి ముంజలు స్వాభావికమైన ఔషధం అని చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను ముంజలు నివారిస్తాయి. ముంజలు ఒంట్లో పేరుకొనిపోయిన విషాలను సమర్థంగా తొలగిస్తాయి. ఫలితంగా ఇవి కాలేయంపై పడే ఒత్తిడిని తొలగించి, కాలేయానికి మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. ఇలా విషాలను తొలగించడానికి ముంజల్లోని పొటాషియమ్ బాగా ఉపయోగపడుతుంది. ముంజల్లో పొటాషియమ్ పాళ్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి రక్తపోటును కూడా సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో చలవచేసే గుణం ఉన్నందువల్ల వేసవిలో వచ్చే గడ్డలను నివారిస్తాయి. ఒకవేళ గడ్డలు వచ్చినా అవి ముంజలు తినేవారిలో త్వరగా తగ్గిపోతాయి. అంతేకాదు.. ముంజలతో చలవ చేసే ఆ గుణమే చెమటకాయలనూ తగ్గిస్తుంది. ముంజల్లోని యాంటా ఆక్సిడెంట్స్ వల్ల అవి రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. ముంజల్లో పుష్కలంగా ఉండే ఫైటోకెమికల్స్ వల్ల వయసు పైబడటంతో కనిపించే లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే క్లాట్స్‌ను ముంజలు నివారిస్తాయి. దాంతో గుండెజబ్బులు తగ్గిపోతాయి. గుండెపోటు ముప్పు దూరమవుతుంది. -
నాలుగు ముంజెలు చారెడు చక్కెర....
వేసవి జ్ఞాపకం... ఎండాకాలంలో వీధుల్లో తాటిముంజల మనిషి తిరగడం ఒక కళ. పచ్చివాసనలేసే తాటి ఆకుల్లో వొలిచిన తాటి ముంజెల్ని చుట్టి కావడి బద్దకు వేళ్లాడగట్టి అటూ ఇటూ పచ్చటి కట్టలను భుజాన మోస్తూ ‘తాటి ముంజలో’ అని తిరగడం ఎండ పూట మెరిసే ఒక ఊరి కళ. కాని అమ్మేవాళ్లలో చాలా మందికి ఈ ఓపిక ఉండదు. చెట్టు నుంచి దించిన గెలల్ని నేరుగా తీసుకొని బజారుకు వచ్చేస్తారు. కొడవలితో తీపి చిలకరింతలు పెట్టడానికి సిద్ధమవుతారు. తినేవారికి కొదవా? చుట్టూ మూగుతారు. నాకొకటి నాకొకటి అని తాటిముంజెల్ని అందుకుని పొడిచి తినడానికి బొటనవేలును స్పూన్‌లా మార్చేస్తారు. మూడు కన్నులు తేలిన తాటికాయను ఒక చేతిలో బౌల్‌లాగా పట్టుకొని మరో చేతి బొటనవేలుతో ఒక్కో ముంజెను పొడిచి పొడిచి తింటారు. కొన్ని ముంజెల్లో నీళ్లు నిండుగా ఉంటాయి. వేలు పొడవగానే చివ్వున లేచి ముఖాన కొడతాయి. అవి నేల పాలు కాకుండా నోటికి పట్టి గుటకాయస్వాహా చేయడం పెద్ద నైపుణ్యం. ఇక పిల్లలకైతే ముంజెల బండి దగ్గర నిలుచోవడం సరదా. ఎండ పూట ఏదో ఒక కూడలిలో చెట్టు నీడన బండి ఆపి ముంజెలమ్మే మనిషి ఒక్కో తాటికాయను కోరిన వారికి కొట్టి కొట్టి ఇస్తూ ఉంటే చూడటం పిల్లలకు వేడుక. ఒక్కోసారి దయదలిచిన వారు వాళ్లకూ ఒక కాయ ఆఫర్ చేయవచ్చు. రెండు ముంజెలు తిని మూడోదాన్ని వాళ్లకు వదిలిపెట్టవచ్చు. ఖాళీ చేసిన తాటికాయను బండి చక్రంగా మార్చుకోవడం ఒక ఆట. రెండు తాటికాయలను రెండు చక్రాలుగా చేసి మధ్యలో పుల్ల గుచ్చి తాటి ఆకు చీలికను పుల్లకు ముడి వేసి ముడి చివరన పురికోస కట్టి లాక్కూంటూ వెళ్లడం ఇన్నోవా క్రిస్టా కంటే తక్కువ లగ్జరీ కాదు. కొందరు ఒక పంగా కర్ర చివరన ఒక తాటికాయను గచ్చి దానిని స్టీరింగ్‌లా వాడుతూ పంగతో బండి తోసుకెళ్లడం కూడా ముద్దులొలికే ఆట. ముదురు బెండకాయే కాదు ముదురు తాటిముంజ కూడా తినడానికి పనికి రాదు. తింటే కడుపులో నొప్పి పడుతుంది. అసలు వైభోగం అంటే ఏమిటంటే మంచి ఎండపూట తాటి ముంజెలు కొనుక్కొని వచ్చి భోజనం చేశాక తీరిగ్గా వొలిచి చిన్న ముక్కలుగా చేసి ఒక స్టీలు పాత్రలో పోసి పైన చక్కెర జల్లి ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నం కునుక్కు ఉపక్రమించాలి. నిద్ర లేచే సరికి ముంజెలు చల్లబడి చక్కెరపట్టి నోటికి హాయిగా కడుపుకు చల్లగా సిద్ధంగా ఉంటాయి. కెఎఫ్సి, మెక్డొనాల్డ్స్లా తాటిముంజెలు ప్రచారం చేసుకోలేకపోవచ్చు. సమ్మర్ ఆఫర్స్ ప్రకటించకపోవచ్చు. కాని వేళ్లు దిగిన సంస్కృతి వందలఏళ్లైనా పోదు. కాకుంటే గుర్తు పెట్టుకొని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించాలి. ఈ వేసవిలో పిల్లలకు తాటి చెట్టు చూపించండి. తాటి ఆకు చూపించండి. తాటి ముంజె చూపించండి. బండి దగ్గర ఆగి కొట్టిన తాటి ముంజెన చేతికి ఇస్తే బొటన వేలు గుచ్చగానే నీళ్లు వారి ముఖాన జివ్వున కొడుతూ ఉంటే వారు నవ్వుతూ ఉంటే మీరూ ఫక్కున నవ్వండి. వేసవికి ఇవ్వదగ్గ మర్యాద ఇదే అని గ్రహించండి.