వివాహిత అనుమానాస్పదమృతి
డి.ముప్పవరం (నిడదవోలు రూరల్) : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణించిన ఘటన మండలంలోని డి.ముప్పవరంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కాకరపర్రుకు చెందిన గంగిరెడ్డి నాగలక్ష్మి (26)కి, డి.ముప్పవరానికి చెందిన గంగిరెడ్డి శ్రీనుకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. శ్రీనుకు రేచీకటి వ్యాధి ఉంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. వీరు అత్తమామలతో కలిసి డి.ముప్పవరంలో కాపురముంటున్నారు.
మంగళవారం నాగలక్ష్మి ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా కాలిపోయిన స్థితిలో నాగలక్ష్మి మృతదేహం పడి ఉంది. ఆ సమయంలో భర్త శ్రీనుతోపాటు అత్త, మామలు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తరఫువారు చెబుతుండగా, అది హత్యేనని నాగలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు.
ముమ్మాటికీ హత్యే
అనుమానంతోనే నాగలక్ష్మిని అత్తింటివారే హత్యచేశారంటూ ఆమె బంధువులు ఆరోపించారు. ముందు కొట్టిచంపి, ఆ తర్వాత కాల్చివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడితే మంటలకు గదిలోని మంచం, ఇతర వస్త్రాలు కాలిపోయేవని, కేకలు వినిపించేవని, అటువంటివి ఏమీ లేకుండా గోడకు జారిపడి కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించిందని బంధువులు చెబుతున్నారు. దీనిని బట్టి అది హత్యేనని స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. వారి కథనం ప్రకారం.. నాగలక్ష్మి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించడంతో మేనమామ, మేనత్త పెంచి పెళ్లి చేశారు.
పెళ్లి సమయంలో రూ. 85వేలు కట్నంగా ఇవ్వగా.. మరో 10వేలు ఇవ్వాల్సి ఉంది. పెళ్ళైన నాటి నుంచి నాగలక్ష్మిని ఆమె భర్త అనుమానంతో వేధించాడు. 15రోజుల క్రితం నాగలక్ష్మిని శ్రీను అనుమానంతో కొట్టగా సమాచారాన్ని తెలుసుకున్న మేనమామ దానయ్య వచ్చి కాకరపర్రు తీసుకు వెళ్లారు. వారం రోజుల క్రితం డి.ముప్పవరంలోని స్థానిక పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంతో నాగలక్ష్మి కాపురానికి వచ్చింది. తరుచూ అనుమానించే భర్తతో కాపురం చేయలేనంటూ నాగలక్ష్మి వేడుకున్నా.. పసిపిల్లలను వదిలి ఉండలేక ఆమె కాపురానికి వచ్చిందని బంధువులు చెబుతున్నారు.