మాకూ ఆప్షన్లు ఇవ్వాలి
సచివాలయ ఉద్యోగ సంఘం వినతి
హైదరాబాద్: ఉద్యోగుల కేటాయింపులో సచివాలయ ఉద్యోగులకూ ఆప్షన్లు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. అఖిల భారత సర్వీసెస్ అధికారులకు కల్పించినట్టే.. 18 జే క్లాజు ప్రకారం భార్యాభర్తల బదిలీల్లో ఇస్తున్న వెసులుబాటు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులకూ ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఆయన శుక్రవారం సచివాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు సచివాలయ సమన్వయ కమిటీ సెక్రటరీ జనరల్ వెంకటసుబ్బయ్య, ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు వెంకటకృష్ణలతో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమలనాథన్ కమిటీ సూచనల మేరకు ఈ నెల 5లోగా అందించాల్సిన నివేదికపై చర్చించారు. స్టేట్ కేడర్ స్థాయే కాకుండా జిల్లా, మల్టీ జోన్, జోన్ స్థాయిల్లో ఈ విధానం అమలు పర్చాలని మురళీకృష్ణ కోరారు. ఇక్కడ పనిచేస్తున్న మహిళలు ఉద్యోగాలు చేసే తమ భర్తలను, పురుషులు తమ భార్యలను రప్పించుకున్నారని, వారిని పంపే క్రమంలో భార్యాభర్తల జీవో తప్పనిసరిగా వర్తింపచేయాలని సూచించారు. 18 ఎఫ్ క్లాజ్ తొలగించాలని తెలంగాణ ఉద్యోగులతోసహా తామూ కోరుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకూ ఆప్షన్లు వర్తింపచేయాలన్నారు.
తెలంగాణ ఉద్యోగులూ.. అపోహలొద్దు
ఏపీ ప్రభుత్వం, దాని ఉద్యోగులు చెప్పినట్టు కమలనాథన్ కమిటీ నడచుకుంటోందని తెలంగాణ ఉద్యోగులు అనుమానించడం, పదేపదే కుట్రలు చేస్తున్నారనడం భావ్యం కాదని మురళీకృష్ణ అన్నారు. ప్రతి విషయంలో అపార్థం చేసుకోవద్దన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు అంశంలో ఇక్కడ చదివే ఏపీ విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని, వారి ద్వారా కూడా పన్నులు వస్తున్నాయన్న విషయాన్ని మరువరాదని అన్నారు.