‘ఆయన భార్యను.. మీ కొడుకు చనిపోయాడు’
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళకు చెందిన మరో యువకుడు చనిపోయాడు. డ్రోన్ జరిపిన దాడిలో అతడు మృత్యువాతపడినట్లు అతడి భార్యే స్వయంగా అతడి తండ్రికి సమాచారం ఇచ్చింది. ‘డ్రోన్ జరిపిన దాడుల్లో మీ కుమారుడు చనిపోయాడు మావయ్య. నేను అతడి భార్యను’ అని ఆమె వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముర్షిద్ మహ్మద్ అనే యువకుడు మొత్తం 17మంది యువకులతో కలిసి గత ఏడాది(2016) జూన్ 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా టెహ్రాన్ అక్కడి నుంచి అప్ఘనిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థలో చేరాడు.
నంగర్హార్ ప్రావిన్స్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడికి వెళ్లాక ముఘిరా అనే యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల (ఏప్రిల్) 11న ఓ డ్రోన్ విమానం ఉగ్రవాదుల స్థావరంపై దాడి చేసిందని, ఈ దాడిలో ముర్షిద్ చనిపోయాడని వాట్సాప్ ద్వారా కేరళలోని కాసర్ఘడ్కు చెందిన అతడి తండ్రికి 12, 13 తేదీల్లో సమాచారం అందజేసింది. ప్రస్తుతం అమెరికా జారవిడిచిన అతిపెద్ద బాంబు జరిపిన దాడి ప్రాంతంలోనే ముర్షిద్ ఉండేవాడు. అయితే, ఈ దాడికంటే ముందే అతడి భార్య తెలిపిన వివరాల ప్రకారం చనిపోయాడు. మిగతా కేరళ యువకులు కూడా ప్రస్తుతం యూఎస్ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నారట. అయితే, వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియరావడం లేదు.