సుపారీ హత్య
► వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
► ఆస్తి తగాదాలే కారణం: పోలీసుల అదుపులో ఇద్దరు
బహదూర్‌పురా: ఆస్తి తగాదాల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపారు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ హత్య జరిగింది. ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కథనం ప్రకారం... మూసాబౌలికి చెందిన మీర్జా ఖలీల్ బేగ్ (50) ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి. ఇతని ఖదీర్‌బేగ్ అనే సోదరుడున్నాడు. వీరి కుటుంబానికి ఓ ఇల్లు ఉంది. ఖలీల్‌బేగ్‌కు చెప్పకుండానే సోదరుడు ఖదీర్‌బేగ్ ఆ ఇంటిని ముజుబుల్లా షరీఫ్ అనే వ్యక్తికి విక్రయించాడు.
విషయం తెలుసుకున్న ఖలీల్ బేగ్ నన్ను సంప్రదించకుండా.. నా ఇల్లు ఎలా కొన్నావని షరీఫ్‌తో గొడవ పడ్డాడు. ఇంటి విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్... ఖలీల్‌బేగ్‌ను హత్య చేయించాలని నిర్ణయించాడు. కొందరికి సుపారీ ఇచ్చి రంగంలో దింపాడు. సోమవారం ఉదయం 10 గంటలకు ఐదురుగు దుండగులు మూసాబౌలీలో ఖలీల్ బేగ్‌ను కత్తులతో పొడిచి అతిదారుణంగా చంపేశారు. హతుడి కుటుం బసభ్యుల ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు ఏడుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఐదుగురు ఈ హత్యలో పాల్గొనట్టు గుర్తించామని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూసాబౌలి చౌరస్తాలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.