బయటపడుతున్న కొకైన్ ప్యాకెట్లు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ మూసియా మూసా శరీర భాగం నుంచి కొకైన్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. దుబాయి నుంచి కొకైన్ అక్రమ రవాణా చేస్తూ దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళ నిన్న దొరికిపోయిన విషయం తెలిసిందే. ఉస్మానియ ఆస్పత్రి నుంచి మూసా శరీరం నుంచి ఇప్పటి వరకూ 24 కొకైన్ ప్యాకెట్లను వైద్యులు వెలికి తీశారు.
కాగా అదుపులోకి తీసుకున్న మూసాను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు తొలుత ఆమెకు సీటీ స్కాన్, ఆ తర్వాతా ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించారు. వీటిని జననేంద్రియం, మలద్వారం నుంచి పొత్తి కడుపులోకి ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యులే పొత్తి కడుపులో ఉన్న ఒక ప్యాకెట్‌ను బయటికి తీశారు. మిగిలిన ప్యాకెట్లు తీయడం సాధ్యం కాకపోవడంతో సర్జికల్ వార్డుకు తరలించారు.
రాత్రి ఏడు గంటలకు 'ఎనిమా' ఇచ్చారు. దాంతో మలద్వారం నుంచి 16-20 (క్యాప్సూల్స్ రూపంలో ఉన్నవి) డ్రగ్స్ బయట పడ్డాయి. ఒక్కో క్యాప్సూల్ ఒక అంగుళం మందం నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లు సహజంగా బయటకు రాకుంటే పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స చేసి వెలికి తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు.