మ్యాజిక్ సిటీ.. మయామి!
మయామి : ఆగ్నేయ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలో ఉన్న పెద్ద నగరం మయామి. ఇది ఫ్లోరిడాలో అత్యంత జనసమ్మర్ధ కౌంటీ. దక్షిణ ఫ్లోరిడాకు ప్రధాన కేంద్రం. న్యూయార్క్, లాస్ ఏంజిలిస్, చికాగోల తర్వాత అమెరికాలో నాలుగో అతిపెద్ద పట్టణం. ఇదే రోజున మయామి నగరం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ నగర విశేషాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..!
ఎన్నో ప్రత్యేకతలు..
2013 జనాభా లెక్కల ప్రకారం ఈ నగర జనాభా 4,17,650. ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, వినోద.. రంగాల్లో దీనికున్న అంతర్జాతీయ గుర్తింపు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ‘డౌన్ టౌన్ మయామి’ యూఎస్‌లోని అంతర్జాతీయ బ్యాంక్‌లకు అతి పెద్ద స్థావరం. దీంతో పాటే అనేక సంస్థల ముఖ్య కేంద్రాలు, టెలివిజన్ స్టూడియోలు ఇక్కడ కొలువుదీరాయి. పోర్ట్ ఆఫ్ మయామి ప్రపంచంలోనే అత్యంత రద్దీగల నౌకాశ్రయం. ఈ నగరానికుండే ప్రత్యేకతల వల్ల ‘మ్యాజిక్ సిటీ’గా పేరుగాంచింది.
మయామి నౌకాశ్రయం..
ఇది అమెరికాలోని అతి పెద్ద నౌకాశ్రయం. ప్రపంచంలోనే అతిపెద్ద విహార ఓడల కేంద్రం. దీన్ని ‘క్రూయిజ్ కాపిటల్ ఆఫ్ ది
వర ల్డ్, కార్గో గేట్‌వే ఆఫ్ ది అమెరికాస్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల నౌకాశ్రయం కూడా ఇదే. ఇది లాటిన్ అమెరికా నుంచి సరకు ఎగుమతి, దిగుమతుల్లో న్యూ ఆర్లియన్స్‌లోని ‘పోర్ట్ ఆఫ్ సౌత్ లూసియానా’ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ నౌకాశ్రయం దిగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 518 ఎకరాలు. ఏడు ప్రయాణికుల టెర్మినల్స్‌ను కూడా కలిగి ఉంది.
చరిత్ర..
ఈ ప్రాంతంలో 1000 ఏళ్లకు పూర్వమే ప్రజలు నివసించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అయితే 1556లో ఈ ప్రాంతం తమదని స్పెయిన్ ప్రకటించింది. 1567లో దీని కోసం ఒక స్పానిష్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 1836లో ఫోర్డ్ డల్లాస్ నిర్మించడంతో మయామి ప్రాంతం రెండో సేమినోల్ యుద్ధంలో పోరాట ప్రదేశంగా మారింది. అమెరికాలో ఒక మహిళ (జూలియా టట్టిల్) ప్రణాళిక రచించిన ఏకైక నగరం కూడా ఇదే కావడం విశేషం. ఈ పట్టణ అభివృద్ధికి టట్టిల్ చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ‘మయామి మాత’అని పిలుస్తారు. 1896 జూలై 28న అధికారికంగా 300 జనాభాతో నగరంగా ఏర్పాటైంది.
ఆర్థిక వ్యవస్థ..
దేశంలోని అత్యంత ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో మయామి ఒకటి. ఇది పలు వాణిజ్య, ఆర్థిక సంస్థలకు ప్రధాన స్థావరం. గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ స్టడీ గ్రూప్ అండ్ నెట్వర్క్ (జీఏడబ్ల్యూసీ) ప్రపంచ నగరాలకు ఇచ్చిన ర్యాంకుల్లో దీన్ని ‘బీటా ప్రపంచ నగరం’గా గుర్తించింది. పర్యాటకం కూడా మయామిలో ముఖ్యమైన పరిశ్రమ. సముద్ర తీరాలు, సమావేశాలు, పండుగలు, వివిధ కార్యక్రమాలకు ఏటా 1.2 కోట్ల మంది ఈ నగరాన్ని సందర్శిస్తున్నారని అంచనా. సౌత్ బీచ్‌లోని చారిత్రక ఆర్ట్ డెకో జిల్లా, దాని ప్రపంచ ప్రసిద్ధ నైట్ క్లబ్బులు, చారిత్రక భవనాలు, పాపింగ్లలో ప్రపంచంలోని అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.
శీతోష్ణస్థితి..
మయామి అయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. వేడి, తేమతో కూడిన వేసవికాలం, స్వల్పకాలిక వెచ్చని శీతాకాలాలతో వాతావరణం పొడిగా ఉంటుంది. సముద్రమట్టపు ఉన్నతి, తీర ప్రాంతాలు.. కర్కాటక రేఖకు కొద్దిగా పైన ఉన్నాయి. శీతాకాల సగటు ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించదు. వేసవి కాలం వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అట్లాంటిక్ మహా సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల వేసవి ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతాయి.
సంస్కృతి..
ఈ నగరం పలు వినోద కేంద్రాలు, ప్రదర్శనశాలలు, మ్యూజియాలు, ఉద్యానవనాలకు స్థావరంగా ఉంది. కళా రంగానికి చెందిన ‘అడ్రిఎన్నే ఆర్ట్స్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ తర్వాత అమెరికాలోని రెండో అతి పెద్ద ప్రదర్శనా కేంద్రం. ఇక్కడ ఉన్న మ్యూజియాల్లో అధిక భాగం డౌన్టౌన్లో ఉన్నాయి. అనేక ఫ్యాషన్ ప్రదర్శనలకు కూడా మయామి ఆతిథ్యం ఇస్తోంది. అనధికారికంగా ‘ఒలింపిక్స్ ఆఫ్ ఆర్ట్’గా పిలిచే కార్యక్రమం ప్రతి ఏటా డిసెంబర్లో నిర్వహిస్తారు.
సంగీతం..
మయామి సంగీతం విభిన్నమైంది. క్యూబన్లు వారి స్వస్థలం నుంచి తీసుకొచ్చిన కొంగ, రుంబలను అమెరికన్ సంస్కృతిలో భాగం చేశారు. డొమెనికన్లు బచట, మేరెంగ్యూలను తీసుకురాగా, కొలంబియన్లు వల్లేనాటో, కుమ్బియాలను పరిచయం చేశారు. వెస్ట్ ఇండియన్స్, కరేబియన్లు రేగ్గే, సోకా, కొంపా, జౌక్, కలిప్సో, స్టీల్పాన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు.
భాషలు..
స్పానిష్ ప్రధాన భాషగా ఉంది. నివాసితుల్లో 66 శాతం మంది స్పానిష్, 25 శాతం మంది ఆంగ్లం మాట్లాడేవారున్నారు. అతి కొద్ది మంది మాత్రం హైతియన్ క్రేయోల్, ఫ్రెంచ్, పోర్చుగీస్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, చైనీస్, గ్రీక్.. భాషలు మాట్లాడతారు.