పసిడి ధరలు వెల వెల
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. విదేశీ ధోరణి, స్థానిక నగల దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి దిగి వస్తోంది. అయితే వెండి ధరలుమాత్రం స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కారణంగా ఇకపై ద్రవ్యోల్బణం బలపడనున్నట్లు ఫెడ్ అధికారులు తాజాగా పేర్కొనడంతో డాలరు ఇండెక్స్ 97కు బలపడింది. ఇది పరోక్షంగా దేశీయ కరెన్సీ, పసిడిలో అమ్మకాలకు కారణమైంది. అటు ఫ్రాన్స్‌లోనూ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, బ్రెక్సిట్ చర్చలు మొదలుకావడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా పసిడిపట్ల విముఖతను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత పది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ. 29,000, రూ .28,850 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 70 పడిపోయింది. అయితే సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 24,400 గా నమోదైంది. మరోవైపు వెండి కేజీ ధర రూ. 38,700 వద్ద ఉంది. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.60 పెరిగి కు రూ .38,300 కి చేరుకుంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర రూ. 28, 547 వద్ద ఉంది.