కొత్తబస్సుల కొనుగోలులో బెస్ట్‌కు సాయం చేస్తాం: బీఎంసీ
గతంలోనూ రూ. 1,600 కోట్లు అందజేత
సాక్షి, ముంబై: కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వెల్లడించింది. అయితే ఈ నిధులు అప్పు రూపంలో ఇవ్వనుండటంతో ఈ మొత్తాన్ని బెస్ట్ సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
దీంతో నష్టాల బాటలో నడుస్తున్న సంస్థకు రుణాలు ఇచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం బీఎంసీ రూ.1,600 కోట్లు బెస్ట్‌కు అప్పుగా ఇచ్చింది. అంతేగాకుండా చార్జీలు పెంచకుండా అందులో రూ.150 కోట్లు మినహాయింపు ఇచ్చింది.
కాగా, ప్రస్తుతం బెస్ట్ సంస్థ ఆదీనంలో నడుస్తున్న 3,500 పైగా బస్సుల్లో సుమారు 300 బస్సులు పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బెస్ట్ సంస్థ రూ.700 కోట్లకుపైగా నష్టాల్లో నడుస్తోంది. చార్జీలు పెంచినప్పటికీ ఈ లోటును పూడ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 300 కొత్త బస్సులు కొనుగోలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు బీఎంసీ ముందుకు రావడంతో బెస్ట్‌కు ఊరట లభించింది.
అందుకు సంబంధించిన ప్రతిపాదనపై స్థాయి సమితి అధ్యక్షుడు శైలేష్ ఫణసే ఆమోద ముద్రవేశారు. కాగా, ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) మాదిరిగా బెస్ట్ బస్సులపై బీఎంసీ లోగో అమర్చాలని బీఎంసీ శరతులు విధించనుంది. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న బెస్ట్ బస్సుల్లో కొన్నింటిని ఎంయూటీపీ నిధులతో కొనుగోలు చేయడంతో వాటిపై ఎంయూటీపీ లోగో ఉంది. దీంతో బీఎంసీ అందజేసిన నిధులతో కొనుగోలు చేసిన బస్సులపై ఆ సంస్థ లోగో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.