మ్యూచువల్ డైవర్స్‌లో మోసం
గైడ్
నేను మా వారితో పాటు న్యూయార్క్‌లో ఉండేదాన్ని. అయితే ఆయన నన్ను మోసగించి, నాకు తెలియకుండా మ్యూచువల్ డైవోర్స్ పేపర్స్ మీద సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇండియా పంపేశారు. నేను హైదరాబాద్ సివిల్ కోర్టులో కేసు వేశాను. రెండేళ్లుగా సమన్లు పంపుతున్నా ఆయనకు అందడం లేదు. అడ్రస్ మారిపోయి ఉండొచ్చు. కానీ కొత్త అడ్రస్ నాకు తెలియదు. ఆయన పని చేసే కంపెనీ కూడా సమన్లు అందుకోవడం లేదు. నాకేం చేయాలో తెలియడం లేదు. మార్గం తెలపండి.
- ఓ బాధితురాలు, హైదరాబాద్
ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. చాలామంది ఇలాగే తమ భార్యలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను ఇండియా పంపేసి, అమెరికాలో మకాం మార్చేస్తున్నారు. దాంతో ఆచూకీ తెలియక అమ్మాయిలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మీరేం చేస్తారంటే... మీ లాయర్ ద్వారా అమెరికన్ కాన్సులేట్‌ని, ఇండియన్ కాన్సులేట్‌ని సంప్రదించండి. మొత్తం జరిగినదంతా వారికి వివరించండి. వారు తప్పక సహకరిస్తారు. మీ వారి ఆచూకీని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. ధైర్యంగా ఉండండి.
నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు. నేను తనతో సరదాగా గడపడానికి వెళ్లాలనుకుంటున్నాను. నా దగ్గర పాస్‌పోర్ట్ అయితే ఉందిగానీ ఎలా వెళ్లాలో, వెళ్లాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. దయచేసి నాకా వివరాలు తెలపండి.
- స్టీవెన్ కుమార్
మీకు నిజంగా అమెరికా వెళ్లాలని అంత ఆశగా ఉంటే... అక్కడ ఉన్న మీ ఫ్రెండ్ మీకు స్పాన్సర్ చేయవచ్చు. కాబట్టి తన సహాయం కోరండి. లేదంటే మీరు వీసా కోసం అమెరికన్ కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాన్సులేట్ అడ్రస్: కాన్సులేట్ జనరల్ ఆఫ్ ద యూఎస్ఏ - హైదరాబాద్, 1-8-323, పైఘా ప్యాలెస్, చిరాన్ ఫోర్ట్ లేన్, బేంగపేట, సికింద్రాబాద్ - 03.
లక్ష్మీ దేవినేని, చైర్పర్సన్,
‘తానా’ ఇమిగ్రేషన్ కమిటీ